భక్తుల సెంటిమెంట్‌కు గౌరవం.. కేసీ కెనాల్‌లోనే వినాయక నిమజ్జనం
ఆంధ్రప్రభ, కర్నూలు : వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తుల మనోభావాలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల విజ్ఞప్తులకు అనుగుణంగా కేసీ కెనాల్‌లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లపై గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగే వినాయక నిమజ్జన వేడుకల్లో కర్నూలుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. 40 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా కేసీ కెనాల్‌లోనే నిమజ్జనం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
నీటి కొరత నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
ప్రస్తుతం సుంకేసుల బ్యారేజీలో నీటి లభ్యత తక్కువగా ఉందని, గత రెండు దశాబ్దాల రికార్డులతో పోలిస్తే అత్యల్ప నీటి మట్టం నమోదైందని మంత్రి తెలిపారు. దీంతో అక్కడి నుంచి కేసీ కెనాల్‌కు నీరు వచ్చే అవకాశం లేదన్నారు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని తాగునీటి అవసరాల కోసం నిల్వ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసీ కెనాల్‌లోని అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్ ప్రాంతాల్లో అవసరమైన గోడలు నిర్మించి సుమారు 600 మీటర్ల మేర ప్రాంతాన్ని ట్యాంక్ తరహాలో సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
కర్నూలు నీటి సరఫరా కేంద్రం నుంచి వాటర్ ట్రీట్‌మెంట్ అనంతరం వచ్చే నీరు, బ్యాక్‌వాటర్ తదితర మార్గాల ద్వారా సుమారు 20 లక్షల లీటర్ల నీరు అందుబాటులోకి వస్తుందని మంత్రి వెల్లడించారు. నిమజ్జన సమయానికి అక్కడ 6 నుంచి 9 అడుగుల మేర నీటి మట్టం ఉండే అవకాశం ఉందన్నారు. భక్తులు, వినాయక విగ్రహాలను సురక్షితంగా నిమజ్జనం చేసుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 600 మీటర్ల పరిధిలో క్రేన్లు, భద్రతా చర్యలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.
ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించినా.. కేసీ కెనాల్‌కే మొగ్గు
హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలోని నన్నూరు టోల్‌గేట్, తడకనపల్లి, ఉలిందకొండ పరిసర ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించినప్పటికీ.. భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల అభిప్రాయాలను గౌరవించి కేసీ కెనాల్‌లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
ఈసారి గతంలో కంటే మరింత వైభవంగా, భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.
భద్రతకు ప్రాధాన్యత: ఎమ్మెల్యే గౌరు చరిత
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ.. కర్నూలు నగరంలో నాలుగు దశాబ్దాలుగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. భక్తుల సెంటిమెంట్‌కు అనుగుణంగా, ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
కేసీ కెనాల్‌లో నీటిని నిల్వ చేసి, అవసరమైన చోట అడ్డుగోడలు ఏర్పాటు చేసి నిమజ్జనానికి అనుకూలంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీ కోరిన ప్రాంతంలోనే ఏర్పాట్లు చేసేలా అధికారులతో సమన్వయం చేసుకుంటామని పేర్కొన్నారు.
కేసీ కెనాల్ వద్ద ఘాట్ ఏర్పాటు చేయడంతో పాటు భద్రతా పరంగా మెరుగైన ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ శాఖల సిబ్బంది గణేష్ ఉత్సవ కమిటీతో సమన్వయంతో పనిచేయాలని కోరారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు, జిల్లా ఫైర్ ఆఫీసర్ అవినాష్ జయసింహ, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
