ప్రజా సమస్యల పరిష్కారమే ‘సీఎం ప్రజావాణి’ ధ్యేయం

  • సీఎం ప్రజావాణికి 74 అర్జీలు..
  • పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం
  • ప్రజల విశ్వాసం పెంచేలా పనిచేయాలి..
  • అధికారులకు గద్వాల్‌ విజయలక్ష్మి సూచన

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : ప్రజల సమస్యలను పరిష్కరించడమే ‘సీఎం ప్రజావాణి’ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్‌పర్సన్‌, సీఎం ప్రజావాణి స్టేట్‌ ఇన్‌చార్జ్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం ప్రజావాణి వేదికగా పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన 255వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో గద్వాల్‌ విజయలక్ష్మి ప్రజల నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమస్యలపై చర్చించారు.

అర్జీలపై తక్షణ స్పందన..

ప్రజలు తెలియజేసిన సమస్యలను గద్వాల్‌ విజయలక్ష్మి ఓపికగా విన్నారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్జీలపై ప్రత్యేకంగా నోట్స్‌ రాసుకుని, అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

సీఎం ప్రజావాణికి వచ్చే దరఖాస్తుల్లో ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, హోంశాఖలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని గద్వాల్‌ విజయలక్ష్మి తెలిపారు. మండలం, డివిజన్‌, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయని ఆమె పేర్కొన్నారు.

74 దరఖాస్తుల స్వీకరణ

మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 74 దరఖాస్తులు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకు 23, విద్యుత్‌ శాఖకు 8, బీసీ సంక్షేమ శాఖకు 7 దరఖాస్తులు రాగా.. ఇతర శాఖలకు సంబంధించి 36 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో స్టేట్‌ నోడల్‌ అధికారి కే. విద్యాసాగర్‌, డిప్యూటీ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఏసీపీ ఉమేందర్‌, ప్రవాసి ప్రజావాణి నుంచి మంద భీమ్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.