కోతులు పట్టించండి.. మహా ప్రభో..!
కోతుల దాడులతో ప్రజల బెంబేలు..
పట్టించుకోని పాలకులు..
వీధుల్లో కుక్కలు.. ఇళ్లపై కోతుల సంచారం
మోత్కూర్, ఆంధ్రప్రభ : కోతులను పట్టించి తమను భయాందోళన నుంచి కాపాడాలని మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప, జామచెట్లబావి ప్రాంతాల ప్రజలు పాలకులు, అధికారులను వేడుకుంటున్నారు. ప్రజలు, చిన్నారులు, మహిళలపై కోతులు విచక్షణారహితంగా దాడులు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొండగడపలో ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఓ మహిళతో పాటు ఐదేళ్ల బాలుడిపై కోతులు దాడి చేశాయి. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు. నిత్యం ఇళ్లపై కోతులు గుంపులుగా సంచరిస్తూ దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు వీధుల్లో కుక్కల స్వైరవిహారం కూడా పెరిగి, అవి సైతం ప్రజలపై దాడులు చేస్తున్నాయని చెబుతున్నారు. కోతులు, కుక్కల బెడద కారణంగా మహిళలు, విద్యార్థులు, వృద్ధులు ఒంటరిగా రోడ్లపైకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కోతులను పట్టించి, మిగిలిన ప్రాంతాలను పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో పూర్తిస్థాయిలో కోతులను పట్టించి ప్రజల ఆరోగ్య, భద్రతలను పరిరక్షించాలని కోరుతున్నారు. వీధుల్లో కుక్కల స్వైరవిహారంతో వేకువజామున, చీకటి వేళల్లో రైతులు, మహిళలు, కూలీలు, నడకకు వెళ్లే ప్రజలు కాలినడకన బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తక్షణమే స్పందించి మోత్కూర్ మున్సిపాలిటీలో కోతులు, కుక్కల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
