రెస్క్యూ బోటు బోల్తా.. 15 మంది గల్లంతు !

  • వరద ఉధృతిలో చిక్కుకున్న మత్స్యకారులు..
  • గాలింపు కోసం వెళ్లిన రెస్క్యూ బోటు బోల్తా..
  • రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం..
  • పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

సత్తుపల్లి, ఆంధ్రప్రభ :

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి ప్రాజెక్టులో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. తుఫాన్‌ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులో వరద ఉధృతి పెరిగింది. ఈ క్రమంలో చేపల వల కొట్టుకుపోకుండా కాపాడేందుకు నీటిలోకి వెళ్లిన మత్స్యకారులు వరదలో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు వెళ్లిన రెస్క్యూ బృందం ప్రయాణిస్తున్న పడవ సైతం బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం 15 మంది గల్లంతైనట్లు ప్రాథమిక సమాచారం.

మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లి..

బేతుపల్లి ప్రాజెక్టులో చేపల వేట కోసం మత్స్యకారుల సంఘం సభ్యులు వలలు ఏర్పాటు చేశారు. అయితే భారీ వర్షాలతో ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగి వరద ఉధృతి ఎక్కువైంది. దీంతో వల కొట్టుకుపోతుందనే ఆందోళనతో సంఘానికి చెందిన పది మంది సభ్యులు నీటిలోకి వెళ్లారు. అప్పటికే వరద ప్రవాహం పెరగడంతో వారు తిరిగి రావడం కష్టంగా మారింది. ఈ విషయం అధికారులకు తెలియడంతో కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే స్పందించి ప్రత్యేక పడవలతో పది మందితో కూడిన రెస్క్యూ బృందాన్ని రంగంలోకి దించారు.

రెస్క్యూ బోటు బోల్తా..

మత్స్యకారులను రక్షించే ప్రయత్నంలో ముగ్గురు మాత్రమే తిరిగి వచ్చినట్లు సమాచారం. మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టేందుకు వెళ్లిన రెస్క్యూ బృందం పడవ ప్రాజెక్టు మధ్యలో బోల్తా పడింది. దీంతో రెస్క్యూ బృందం సభ్యుల ఆచూకీ కూడా తెలియకుండా పోయింది. మొత్తం 15 మంది గల్లంతైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో రెస్క్యూ బృందానికి చెందిన పది మంది ఉన్నట్లు సమాచారం.

రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్‌..

ఘటనపై సమాచారం అందుకున్న కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే, పోలీసు అధికారులు హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాత్రి పది గంటల సమయంలో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బృందాన్ని ప్రాజెక్టులోకి పంపించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.