పదేపదే పొటాషియం తగ్గితే అశ్రద్ధ వద్దు

ఆటోఇమ్యూన్‌ వ్యాధి కావచ్చు: డా. కళాధర్‌

సకాలంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం

మహబూబ్‌నగర్‌, ఆంధ్రప్రభ : పదేపదే పొటాషియం స్థాయులు తగ్గుతున్నా సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మలక్‌పేట్‌ యశోదా ఆస్పత్రి క్రిటికల్‌ కేర్‌ విభాగం అధిపతి డా. ఎస్‌. కళాధర్‌ హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువకుల్లో సైతం ఆటోఇమ్యూన్‌ వ్యాధులు తీవ్రమైన అవయవ సమస్యలకు దారితీస్తున్నాయని, శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.

గద్వాల జిల్లా రాజోలికి చెందిన 29 ఏళ్ల సందెపోగు సుధాకర్‌ తీవ్ర జ్వరం, దగ్గు, ఆయాసంతో మలక్‌పేట్‌ యశోదా ఆస్పత్రికి వచ్చినప్పుడు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డా. కళాధర్‌ తెలిపారు. రెండు ఊపిరితిత్తుల్లో న్యుమోనియా, మొదటి రకం శ్వాసకోశ వైఫల్యం, సెప్టిక్‌ షాక్‌, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, గుండె వైఫల్యంతోపాటు తీవ్రమైన హైపోకలీమియా ఉన్నట్లు చెప్పారు. గుండె పంపింగ్‌ సామర్థ్యం 40 శాతానికి పడిపోయిందన్నారు.

చికిత్స సమయంలో పొటాషియం స్థాయి పదేపదే పడిపోవడాన్ని కీలక సంకేతంగా గుర్తించి లోతైన వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఏఎన్‌ఏ పరీక్షలో బలమైన సానుకూల ఫలితం రావడంతో సమగ్ర ఏఎన్‌ఏ పరీక్ష నిర్వహించగా, ఇంతకాలం గుర్తించని షోగ్రెన్స్‌ సిండ్రోమ్‌ అనే ఆటోఇమ్యూన్‌ వ్యాధి బయటపడిందన్నారు.

ఈ వ్యాధి మూత్రపిండాలపై ప్రభావం చూపి పొటాషియం స్థాయులు తీవ్రంగా తగ్గడానికి కారణమైందని డా. కళాధర్‌ వివరించారు. సకాలంలో అసలు కారణాన్ని గుర్తించి ముక్కు, నోటి ద్వారా ఒత్తిడితో కూడిన ఆక్సిజన్‌ చికిత్స, ఆక్సిజన్‌ సహాయం, యాంటీబయాటిక్స్‌, ఊపిరితిత్తుల్లో నీరు చేరిన సమస్యకు చికిత్సతోపాటు పొటాషియం స్థాయిని సరిచేసే చికిత్స చేపట్టామని తెలిపారు.

వివిధ విభాగాల నిపుణుల సమన్వయంతో చికిత్స అందించడంతో రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడన్నారు. చికిత్స అనంతరం గుండె పంపింగ్‌ సామర్థ్యం 40 శాతం నుంచి 65 శాతానికి మెరుగుపడిందని చెప్పారు. జ్వరం, ఆయాసం, తీవ్రమైన బలహీనతతోపాటు పదేపదే పొటాషియం తగ్గడం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డా. కళాధర్‌ సూచించారు.

సాధారణ ఇన్‌ఫెక్షన్‌గా భావించి చికిత్స ఆలస్యం చేయడం ప్రమాదకరమని, ముఖ్యంగా పొటాషియం స్థాయి పదేపదే పడిపోతుంటే దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తించడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఈ కేసులో సకాలంలో వ్యాధిని గుర్తించడం వల్లే యువకుడిని ప్రాణాపాయం నుంచి కాపాడగలిగామని తెలిపారు.

ఈ చికిత్సలో ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌ డా. ఉగంధర్‌ భట్టు, ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డా. పవన్‌ పొద్దార్‌, నెఫ్రాలజిస్ట్‌ డా. సుధాకర్‌ జి., రుమటాలజిస్ట్‌ డా. నీలాద్రి భౌమిక్‌ సమన్వయంతో సేవలు అందించారని డా. కళాధర్‌ తెలిపారు.