ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..
ఆంధ్రప్రభ: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ఆ సుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. భారతీయ సినీ రంగంలో అత్యంత గౌరవం పొందిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. విభిన్నమైన ఆలోచనలు, సృజనాత్మక కథనం, ప్రయోగాత్మక చిత్రాలతో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో సింగీతం శ్రీనివాసరావు ఎన్నో చిరస్మరణీయ చిత్రాలను తెరకెక్కించారు. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’, ‘మయూరి’ వంటి సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. వాణిజ్య విజయాలకే పరిమితం కాకుండా.. విభిన్న కథాంశాలు, వినూత్నమైన కథనంతో భారతీయ సినిమాకు తనదైన శైలిని అందించారు.
సినిమాపై ఆయనకున్న అభిరుచి, అంకితభావం చివరి వరకు కొనసాగింది. 94 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో సినిమాలకు పనిచేశారు. ఇటీవల ‘సింగీతం’ చిత్రానికి దర్శకత్వం వహించి తనకు సినిమాపై ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గలేదని చాటుకున్నారు. ఆయన సృజనాత్మకత, ప్రయోగాత్మక దృక్పథం, మరపురాని కథలు ఎన్నో తరాల సినీ ప్రేక్షకులను ప్రభావితం చేశాయి.
సింగీతం శ్రీనివాసరావు మరణంతో భారతీయ, ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ ఒక దిగ్గజ దర్శకుడిని కోల్పోయింది. ఆయన తెరకెక్కించిన వైవిధ్యభరితమైన చిత్రాలు, అందించిన వినూత్న ఆలోచనలు, సినిమా రంగానికి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
