cine director| ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా
- విషాదాన్నివ్యక్తిగత కక్షలకు వాడుకోవద్దు!
- సినిమాలపై నిందలు వేయడమేంటి?
- బాధితుల పట్ల సానుభూతి చూపించాలి..
- విమర్శలపై సందీప్ రెడ్డి వంగా ఘాటు స్పందన..
- అవకాశవాదులంటూ నటీనటులు, దర్శకులు, నిర్మాతలపై ఆగ్రహం
- వంగాకు రామ్‌గోపాల్ వర్మ మద్దతు..
- ‘యానిమల్’ సన్నివేశంపై మరోసారి చర్చ
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : సమాజంలో చోటుచేసుకుంటున్న నేరాలు, హింసాత్మక ఘటనలకు సినిమాలే కారణమంటూ దర్శకులు, నటీనటులను లక్ష్యంగా చేసుకోవడం సరైన పద్ధతి కాదని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడులో పాఠశాల విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో సినిమాల్లో హింసపై చర్చ మొదలైంది. ముఖ్యంగా సందీప్ దర్శకత్వం వహించిన ‘యానిమల్’ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ పలువురు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 4న తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందించిన ఆయన.. విషాద ఘటనలను వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఉపయోగించుకోవద్దంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
బాధితుల పట్ల సానుభూతి చూపించాలి
ఎవరైనా అత్యంత దారుణమైన నేరానికి పాల్పడినప్పుడు మొదట స్పందించాల్సింది బాధితుల పట్ల సానుభూతితోనేనని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు. ఆ ఘటనకు కారణమైన విస్తృత సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అంతేకానీ, జరిగిన ప్రతి దారుణానికి సినిమాలను సులభంగా నిందించడం, వాటిని బలిపశువులుగా మార్చడం సరికాదని అన్నారు.
వ్యక్తిగత కక్షల కోసమేనా?
తన ట్వీట్‌లో కొందరు నటీనటులు, దర్శకులు, నిర్మాతలపై సందీప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధితులు, వారి కుటుంబాల పట్ల నిజమైన ఆందోళన కంటే.. జరిగిన విషాదాన్ని తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నారనే భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు. అవకాశాలు లేక నిరాశలో ఉన్న కొందరు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఇతరుల సినిమాలను విమర్శించే అవకాశం వచ్చినప్పుడల్లా సామాజిక సంస్కర్తలుగా మారిపోతున్నారని విమర్శించారు. ఇలాంటి ధోరణి సరికాదని స్పష్టం చేశారు.
‘యానిమల్’ సన్నివేశంపై విమర్శలు
రాప్తాడు పాఠశాలలో 21 ఏళ్ల యువకుడు ఎలక్ట్రిక్ చైన్‌సాతో విద్యార్థినిపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం సోషల్ మీడియాలో సినిమాల్లో హింస ప్రభావంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ‘యానిమల్’ సినిమాలో రణ్‌బీర్ కపూర్ ఆయుధంతో తరగతి గదిలోకి ప్రవేశించే సన్నివేశాన్ని కొందరు నెటిజన్లు ప్రస్తావించారు. ఇలాంటి సన్నివేశాలు యువతపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, హింసను ప్రోత్సహించే ప్రమాదం ఉందని విమర్శించారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సైతం ఇలాంటి చిత్రాలు నేరాలకు పాల్పడేవారికి నమూనాలుగా మారే ప్రమాదం ఉందంటూ అభిప్రాయపడినట్లు కథనాలు వెలువడ్డాయి.
సందీప్‌కు ఆర్జీవీ మద్దతు
ఈ వివాదంపై సీనియర్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా గతంలో స్పందించారు. సినిమాల వల్ల సమాజంలో హింస పెరుగుతోందని అనడం సరికాదని సందీప్ రెడ్డి వంగాకు మద్దతుగా వ్యాఖ్యానించారు. రామాయణం వల్ల కిడ్నాప్‌లు పెరుగుతున్నాయని నిందించడం ఎలాంటిదో.. సినిమాలను హింసకు కారణంగా చూపించడం కూడా అలాంటిదేనని ఆయన పేర్కొన్నారు.
విషాదం.. ప్రచారానికి వేదిక కాకూడదు!
తన ట్వీట్ చివరలో సందీప్ రెడ్డి వంగా ఒక విషయాన్ని స్పష్టం చేశారు. విషాద ఘటన జరిగినప్పుడు బాధితులకు అండగా నిలవాలని, వారి కుటుంబాల బాధను అర్థం చేసుకోవాలని అన్నారు. అలాంటి ఘటనలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని పేర్కొన్నారు. ‘ఒక విషాదానికి కావాల్సింది సానుభూతి.. అవకాశవాదం కాదు. ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకోండి’ అంటూ తన అభిప్రాయాన్ని ముగించారు. దీంతో సినిమాల్లో హింస ప్రభావంపై మరోసారి సినీ, సామాజిక వర్గాల్లో చర్చ మొదలైంది.
