హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నగరంలోని కరెంటు, టెలిఫోన్ స్తంభాలపై వేలాడే కేబుల్ వైర్లు (Cable wires) ప్రమాదకరంగా మారాయి. కుప్పలు తెప్పలుగా స్తంభాలపై వైర్లు వేలాడుతున్నాయి. వీటి ద్వారా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ వైర్లు ప్రజలు, వాహనదారులు, పాదచారుల పాలిట యమ పాశాలుగా మారుతున్నాయి. నగరంలో విద్యుత్ స్తంభాల (electric poles)పై ఏర్పాటు చేస్తున్న కేబుల్ టీవీ, ఇంటర్నెట్,(Internet) టెలిఫోన్ వైర్లు నిర్వహణ లోపం కారణంగా ప్రమాదకరంగా మారాయి. విద్యుత్ స్తంభాలపై కేవలం 4 వరుసలతో మాత్రమే కరెంటు తీగలు ఉంటే, ఆ స్తంభాలపై ఇపుడు 40 నుంచి 50 వరుసలతో కూడిన విద్యుత్, ఇంటర్నెట్, కేబుల్ వైర్లు వేలాడుతూ, అవి ఎపుడు వాహనదారులు, పాదచారులపై పడుతాయో తెలియని పరిస్తితి నెలకొంది.ఇలాంటి కేబుల్ వైర్‌కు విద్యుత్ ప్రసారమై ఇటీవల హైదరాబాద్‌లోని రామాంతాపూర్ (Ramantapur)లో ఆరుగురు బలయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అస్తవ్యస్తంగా స్తంభాలపై వేలాడుతున్న కేబుల్ వైర్లను తొలగించాలని ఆదేశించింది. దీంతో విద్యుత్ శాఖ (Department of Electricity) ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.
స్తంభించిన సేవలు..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ఆదేశాల మేరకు విద్యుత్ స్తంభాలకు వేలాడుతూ నగరవాసులు మృత్యువాతకు కారణమవుతున్న స్టార్ కేబుళ్లు, ఇంటర్నెట్ కేబుళ్ల తొలగింపు ప్రక్రియను చేపడుతున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, విద్యుత్ స్తంభాలకు ప్రమాదకరంగా మారిన కేబుళ్లను తొలగిస్తున్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా టీవీ కేబుళ్లతో పాటు ఇంటర్నేట్ కేబుళ్లను కూడా తొలగించడంతో వినియోగదారులు ఇబ్బందుల పాలయ్యారు. ఇంట్లో టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ సేవలు (Internet services along with TV broadcasting) కూడా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. ఇళ్ల నుంచి పని చేసే ఉద్యోగులకు ఇబ్బందులు తప్పలేదు.
నిబంధనలు బేఖాతర్
నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు విద్యుత్ శాఖ స్తంభాలను తమ సొంతానికి వాడుకుంటున్నాయి. వాడవాడలా విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తుండగా.. కొన్ని ప్రైవేటు ఇంటర్నెట్, కేబుల్ టీవీ సంస్థలు ఇష్టారాజ్యంగా కేబుళ్లను స్తంభాల ద్వారా అనుసంధానిస్తున్నాయి. ఫలితంగా విద్యుత్ స్తంభాల వద్ద ఏదైనా సమస్య ఎదురైతే ట్రాన్స్‌కో సిబ్బంది మరమ్మతులు చేయలేకపోతున్నారు. అనుమతులు లేకుండా కేబుళ్లు ఏర్పాటు చేస్తే సదరు వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న నిబంధన ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఏదైనా స్తంభం నుంచి కేబుల్ లాగాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఒక్కో స్తంభానికి రూ.50 నుంచి రూ.100 వరకు ఫీజు చెల్లించాలి. కేబుళ్లు 15 ఫీట్ల ఎత్తులో అమర్చుకోవాలి. కానీ.. మెజార్టీ కేబుళ్లు పది అడుగుల ఎత్తులోనే కన్పిస్తున్నాయి. సపోర్టింగ్ వైరు, కేబుల్ గరిష్ట బరువు మీటరు 200 గ్రాములకు మించరాదు. స్తంభానికి స్తంభానికి మధ్య తీగల పొడవు 50 మీటర్లు మించరాదు. కానీ.. చాలా చోట్ల కేజీల కొద్దీ బరువున్న తీగలను చుట్టారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే జంక్షన్ బాక్సులకు కరెంట్ వాడుతున్నారు. కనీసం నెలవారీ బిల్లు చెల్లించడం లేదు.