మ్యాచ్ ను ముంచేసిన వరుణుడు !

క్రీడాభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. క్యాన్‌బెర్రాలోని చారిత్రక మానుకా ఓవల్‌లో బుధవారం జరిగిన ఈ పోరు వర్షం కారణంగా రద్దయింది.

టాస్ ఓడి.. తొలుత బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా 9.4 ఓవర్లలో 97/1 స్కోరు చేసింది. ఆతిథ్య జట్టుకు భార‌త బ్యాట‌ర్లు సవాలు విసురుతుండగా.. రెండు సార్లు వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. ఇక మూడోసారి భీకరంగా కురవడంతో మ్యాచ్‌ను కొనసాగించే అవకాశం లేకుండా పోయింది.

తొలుత వర్షం కారణంగా మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించగా, ఆసీస్ బౌలర్లపై భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్‌ గిల్ విరుచుకుపడ్డారు. అభిషేక్ (14) త్వరగా నిష్క్రమించినా, క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తనదైన ఫ్లిక్ షాట్లతో అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు.

రెండోసారి వర్ష విరామం తర్వాత ఆట పునఃప్రారంభమైనప్పుడు గిల్‌ (37 నాటౌట్‌, 20 బంతుల్లో), సూర్యకుమార్‌ (39 నాటౌట్‌, 24 బంతుల్లో) జంట కేవలం 3.4 ఓవర్లలో 62 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత్‌ పైచేయి సాధించిన క్షణాల్లోనే వర్షం మళ్లీ దారుణంగా కురవడంతో మ్యాచ్‌ రద్దు అయింది. ఫలితంగా, రెండు జట్లు చెరో పాయింట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Leave a Reply