భద్రత చట్టం కోసం రిలే దీక్ష
నర్సాపురం, ఆంధ్రప్రభ: న్యాయవాదులకు చట్ట భద్రత కల్పించాలని కోరుతూ న్యాయవాదులు రిలే దీక్ష చేపట్టారు. పట్టణ ప్రధాన రహదారిలో కోర్టు వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేసారు. నర్సాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ శిబిరంలో న్యాయ వాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్ష భూనారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిడుమోలు జ్ఞానానంద్ మాట్లాడుతూ సంఘములో కొన్ని అసాంఘిక శక్తులు, పోలీసులు, న్యాయ వాదులపై దాడులు చేస్తూ వారిపై అబద్ధపు కేసు బనాయించి అరెస్ట్ చేయడం జరుగుతుందని, ఈ విధమైన దాడులను అరికట్టడానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలులోకి రావాలని కోరారు.
ఈ యాక్ట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముసాయిదా బిల్లును కూడా తయారు చేసిపెట్టి, దానిని శాసన సభలో పెట్టకుండా చట్టరూపం దాల్చ కుండా కాలయాపన చేస్తుందని మండి పడ్డారు. న్యాయ వాదులపై దాడి చేసిన వారిపైన కేసులు నమోదు చేయుటకు చట్టం అమలు లోనికి రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఇంజేటి జాన్ కెనడీ మాట్లాడుతూ మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల్లో అమలులో ఉన్న చట్టాన్ని ఆంద్ర రాష్ట్రంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ ఏడాది జూన్2 నుంచి అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆమోదం తో అమలులోకి వచ్చిందన్నారు.
అడ్వకేట్స్ ను భౌతికంగా గాని, అతని ఆస్తుల పైన గాని దాడిచేసిన, అతనిని భయ పెట్టినా, హింసించినా అబద్ధపు కేసులు పెట్టినా, ఆవిధముగా నేరము చేసిన తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 6 నెలలు నుండి మూడేళ్ళు వరకు జైలు శిక్షతో బాటు రూ.25 వేలు నుండి రూ.50 వేల వరకు జరిమాన విధించ బడే విధంగా చట్టం రూపొందించారని తెలిపారు. అదే నేరం ఇంకొక సారి చేస్తే ఒక సంవత్సరం నుండి ఏడేళ్ళు వరకు జైలు శిక్షతో బాటు రూ.50వేలు నుండి రూ.లక్ష వరకు జరిమానా విధించబడే విధంగా చట్టం రూపొందించారని తెలిపారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాలలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క ముసాయిదా బిల్లును శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశ పెట్టి చట్ట బద్ధత కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయ వాదులు కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కూరెళ్ళ సోమశేఖర్, న్యాయ వాదులు పోలిశెట్టి బాబ్జీ, దొంగ సుభాష్, పోలిశెట్టి సూరిబాబు, నక్కా ఆనంద్ బాబు, నెక్కంటి క్రాంతి కుమార్, ఆర్ పుల్లాజీ, చల్లా దానయ్య నాయుడు, కరుణానిధి, నవీన్, ఎస్ శ్రీధర్, చిట్టి పద్మజ, కురెళ్ళ అన్నపూర్ణ, కొప్పర్తి శిరీష తదితరులు పాల్గొన్నారు.
