2026 లోనే నియామకాలు !

తెలంగాణ రాష్ట్రంలోని నర్సింగ్ అభ్యర్థులకు వైద్యారోగ్య సేవల నియామక బోర్డు తీపి కబురు అందించింది. 2,322 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి సంబంధించి తాత్కాలిక మెరిట్ జాబితాను బుధవారం విడుదల చేసింది. నియామక ప్రక్రియను వేగవంతం చేస్తూ అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 2,322 పోస్టుల కోసం నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షకు మొత్తం 40,423 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిందరి పూర్తి వివరాలతో కూడిన మెరిట్ జాబితాను బోర్డు ప్రకటించింది. నియామకాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, పూర్తి పారదర్శకతను పాటించేందుకు ప్రతి దశలోనూ అభ్యర్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే విడుదల చేసిన మెరిట్ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ వరకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్, తుది ఎంపిక
అభ్యంతరాల స్వీకరణ ముగిసిన తర్వాత, మెరిట్ ఆధారంగా 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ (ధృవీకరణ పత్రాల పరిశీలన) కోసం పిలవనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే తుది ఎంపిక జాబితాను విడుదల చేస్తారు. ఇటీవల 1,260 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీని విజయవంతంగా పూర్తి చేసిన ఎంహెచ్‌ఆర్‌బీ, ఇప్పుడు ఈ నర్సింగ్ పోస్టుల భర్తీని కూడా అదే వేగంతో పూర్తి చేస్తోంది.
ఎంపికైన అభ్యర్థులు జనవరి నెలలో విధుల్లో చేరే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తాజా మెరిట్ జాబితా కోసం అభ్యర్థులు mhsrb.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
