రీ సర్వే పనులను పకడ్బందీగా నిర్వహించాలి
- జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
మేడిపల్లి, ఆంధ్రప్రభ: రీ సర్వే పనులను పకడ్బందీగా నిర్వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి, తొంబారావుపేట్ గ్రామాల్లో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న రీ సర్వే పనుల పురోగతిని, సర్వే నిర్వహిస్తున్న విధానాన్ని, భూ రికార్డుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీ సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే ప్రక్రియను చేపట్టాలని, భూముల హద్దులు, విస్తీర్ణం తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు. సర్వే సమయంలో ఎదురయ్యే సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రీ సర్వే ద్వారా భూ రికార్డుల్లో ఖచ్చితత్వం ఉండేలా చూడాలని, నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, మేడిపల్లి తహసీల్దార్ మునిందర్, సర్పంచ్ లు సట్ట భూమేష్, నల్ల గంగారెడ్డి, సంబంధిత అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
