RayalaseemaRising |అభివృద్ధితో రాయలసీమకు కొత్త గుర్తింపు: పవన్‌ కళ్యాణ్‌

  • రూ.లక్ష కోట్లతో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌
  • మూడు దశల్లో 10 జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి
  • రైతు పొలం నుంచి ప్రపంచ మార్కెట్‌ వరకు అనుసంధానం

మదనపల్లె, ఆంధ్రప్రభ: కరవుతో సతమతమైన రాయలసీమను ఉద్యాన పంటల సాగు, నీటి వసతులు, రహదారులు, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్‌ హార్టికల్చర్‌ హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. రాయలసీమను ఇకపై కరవు ప్రాంతంగా కాకుండా ఉద్యాన పంటలకు ప్రధాన కేంద్రంగా మార్చడమే లక్ష్యమని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. ఈ ప్రాంతంలో సాగునీటి సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు రైతులు పండించిన పంటలకు మార్కెట్‌ కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పంట ఉత్పత్తి నుంచి నిల్వ, ప్రాసెసింగ్‌, రవాణా, మార్కెటింగ్‌, ఎగుమతుల వరకు ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

రూ.లక్ష కోట్లతో సమగ్ర ప్రణాళిక..

‘ఇంటిగ్రేటెడ్‌ హార్టికల్చర్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌’ కింద రాబోయే మూడేళ్లలో సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయనున్నారు. ఇందులో ప్రభుత్వ రంగం నుంచి రూ.40,352 కోట్లు, ప్రైవేటు పెట్టుబడుల రూపంలో మరో రూ.60 వేల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాయలసీమతో పాటు ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను కలుపుకుని 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఈ ప్రాజెక్టు పరిధిలో 303 మండలాలు, 5,869 గ్రామాలను అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని 8.41 లక్షల హెక్టార్ల నుంచి మరో 6 లక్షల హెక్టార్ల మేర పెంచి మొత్తం 14.41 లక్షల హెక్టార్లకు తీసుకెళ్లాలని ప్రణాళిక రూపొందించారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని కూడా భారీగా పెంచే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది.

సాగునీటికి రూ.21 వేల కోట్లు

రాయలసీమ వ్యవసాయానికి ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను అధిగమించేందుకు భారీగా నిధులు కేటాయించనున్నారు. రిజర్వాయర్లు, కాలువలు, చెరువుల అభివృద్ధితో పాటు మైక్రో ఇరిగేషన్‌ వ్యవస్థలను విస్తరించనున్నారు. సుమారు రూ.20,884 కోట్లను సాగునీటి మౌలిక వసతులకు కేటాయించాలని ప్రణాళికలో ప్రతిపాదించారు. 9 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించడంతో పాటు 4.3 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.

అలాగే సుమారు రూ.4,500 కోట్లతో దాదాపు 6 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. రైతు పొలం నుంచి పంటను వేగంగా మార్కెట్‌కు తరలించేందుకు ఈ రహదారులు కీలకంగా ఉండనున్నాయి.

పంట నుంచి ప్రాసెసింగ్‌.. అక్కడి నుంచి ఎగుమతులు

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా పంట అనంతర మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. ఉద్యాన క్లస్టర్లకు కోల్డ్‌ స్టోరేజీలు, ప్యాక్‌హౌస్‌లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, వాల్యూ యాడెడ్‌ కేంద్రాలు, ఎగుమతి మౌలిక వసతులను అనుసంధానం చేయనున్నారు. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, నిమ్మ, స్వీట్‌ ఆరెంజ్‌తో పాటు డ్రాగన్‌ ఫ్రూట్‌, అవకాడో, బెర్రీలు వంటి అధిక విలువ కలిగిన పంటల సాగును ప్రోత్సహించనున్నారు. మదనపల్లె ఇప్పటికే టమాటా సాగు, మార్కెటింగ్‌కు కీలక కేంద్రంగా ఉండటంతో ఈ ప్రాంత సామర్థ్యాన్ని మరింత విస్తరించనున్నారు.

45 డిగ్రీల వేడిలోనూ యాపిల్‌ సాగు

రాయలసీమ రైతులు కొత్త రకాల ఉద్యాన పంటల సాగులో ముందుకు వస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. సాధారణంగా యాపిల్‌ సాగుకు అనుకూలంగా భావించని అధిక ఉష్ణోగ్రతల ప్రాంతాల్లోనూ యాపిల్‌ సాగు ప్రయోగాలు విజయవంతమవుతున్నాయని తెలిపారు. వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంటలు, ఆధునిక సాగు విధానాలపై దృష్టి పెట్టడం ద్వారా రైతుల ఆదాయ అవకాశాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రాజెక్ట్‌ జలధారతో భూగర్భ జలాలు పెరుగుదల

నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా చేపట్టిన ఫామ్‌ పాండ్లు, ఇతర జల సంరక్షణ పనులతో రాయలసీమలో అదనంగా సాగు భూమిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ‘ప్రాజెక్ట్‌ జలధార’ ద్వారా నీటి సంరక్షణ చర్యలను బలోపేతం చేశామని, ఫలితంగా ఈ ప్రాంతంలో భూగర్భ జలమట్టాలు సగటున 3.6 మీటర్లు పెరిగినట్లు పేర్కొన్నారు.

మూడో ఏడాది నుంచి రూ.81 వేల కోట్ల అదనపు విలువ?

హార్టికల్చర్‌ హబ్‌ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే మూడో సంవత్సరం నుంచి సుమారు రూ.81 వేల కోట్ల అదనపు గ్రాస్‌ వ్యాల్యూ యాడిషన్‌ సాధించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50 లక్షల ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని ప్రణాళికలో పేర్కొన్నారు. పంట అనంతర నష్టాలను తగ్గించి 40 నుంచి 45 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తిని కాపాడుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

మదనపల్లెలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌

హార్టికల్చర్‌ హబ్‌తో పాటు మదనపల్లెలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఏర్పాటుకు కూడా శంకుస్థాపన చేశారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడమే ఈ సంస్థ లక్ష్యంగా ఉంది. డిజిటల్‌ అగ్రికల్చర్‌, ప్రిసిషన్‌ ఫార్మింగ్‌, క్రాప్‌ మానిటరింగ్‌, స్మార్ట్‌ ఇరిగేషన్‌, మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ వంటి అంశాలపై రైతులకు సాంకేతిక సహకారం అందించనున్నారు.
ఈ సంస్థ ఏర్పాటులో రిలయన్స్‌ భాగస్వామ్యం కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత, పరిశోధన, మార్కెట్‌ అవసరాలను అనుసంధానం చేయడంలో ఈ సంస్థ కీలకంగా ఉంటుందని పేర్కొంది.

జల్‌ జీవన్‌ మిషన్‌కు కేంద్ర సహకారం..

ఆంధ్రప్రదేశ్‌లో జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను తిరిగి కొనసాగించేందుకు కేంద్రం సహకరిస్తోందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఈ పథకాన్ని 2028 డిసెంబర్‌ వరకు పొడిగించడంతో పాటు సుమారు రూ.30 వేల కోట్లతో ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం సహకరిస్తోందని చెప్పారు.రాయలసీమలో సాగు, నీటి వసతులు, రహదారులు, ఉద్యాన పంటలు, ప్రాసెసింగ్‌, ఎగుమతులు, వ్యవసాయ సాంకేతికతను ఒకే వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలు కల్పించాలన్నదే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌, కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనంత్‌ అంబానీ, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.