ఉద్యానంతో రాయలసీమకు కొత్త బాట!
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌పై హిందూపురంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమను ఉద్యాన పంటలకు ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’ కార్యక్రమంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు హిందూపురంలో బుధవారం భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఎంజీఎం గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. రాయలసీమలోని అనుకూల వాతావరణాన్ని ఉద్యాన పంటల సాగుకు పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు రైతులకు స్థిరమైన, లాభదాయక ఆదాయం అందించడమే కార్యక్రమ ఉద్దేశమని అధికారులు తెలిపారు. సాగు నుంచి మార్కెటింగ్ వరకు ఉద్యాన రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
ఆధునిక సాగుకు ప్రాధాన్యం
బిందు, తుంపర సేద్యంతో పాటు రక్షిత సాగులో పాలీహౌస్, షేడ్‌నెట్ వంటి ఆధునిక సాంకేతిక విధానాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడంపై అవగాహన కల్పించారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించడంతో పాటు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను సాగు చేయాలని సూచించారు. పంట కోత అనంతరం సరైన నిర్వహణ కూడా కీలకమని అధికారులు తెలిపారు. కోల్డ్‌చైన్ నెట్‌వర్క్, నిల్వ కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, విలువ జోడింపు పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. రాయలసీమ ఉద్యాన ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేయడమే లక్ష్యమన్నారు.
కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ రాయలసీమ ఉద్యాన రంగ సామర్థ్యాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’ ప్రధాన ఉద్దేశమన్నారు. విత్తనం నాటిన దశ నుంచి సాగు, కోత, నిల్వ, ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెటింగ్ వరకు ప్రతి దశలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సంప్రదాయ సాగు పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, నాణ్యమైన ఉత్పత్తిని సాధించడం, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా ఉద్యాన రంగాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చన్నారు. రాయలసీమను ఉద్యాన పంటల ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ జోడింపు, కోల్డ్‌చైన్, ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో రైతుల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.
ట్రాక్టర్ ర్యాలీలో ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఆర్‌ఎస్‌కే సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. జిల్లా ఉద్యాన అధికారి జయకుమార్‌బాబు, జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణయ్య, మండల ఉద్యాన అధికారి మహేష్‌నాయక్, మండల వ్యవసాయ అధికారి సురేంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.
