Rat-Dosa-Rs-25-Lakh-Deal : వావ్‌.. ర్యాట్ దోశ ! Andhra Prabha Crime News

Rat-Dosa-Rs-25-Lakh-Deal : వావ్‌.. ర్యాట్ దోశ ! Andhra Prabha Crime News

  • ఇదొక మిస్ట‌రీ..
  • ముంబైలో రెస్టారెంటుకు తాళం
  • తెర‌మీద‌కు పాతిక లక్షల డీల్‌
  • ఇద్ద‌రు మ‌హిళ‌ల అరెస్టు
  • ఇంత‌కీ దోశలో ఎలుక ఎక్క‌డిది?

(ముంబై, ఆంధ్రప్రభ ప్రతినిధి)

ముంబైలోని ఓ హోటల్‌లో దోశలో ఎలుక కనిపించిందంటూ వచ్చిన ఫిర్యాదు అనూహ్య మలుపు తిరిగింది. కస్టమర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నామంటూ హోటల్‌ యాజమాన్యం నుంచి రూ.25 లక్షలు డిమాండ్‌ చేసి బెదిరించారన్న ఆరోపణలపై ఇద్దరు మహిళలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరినీ అరెస్టు చేసినట్లు తాజా సమాచారం. బోరివలీ వెస్ట్‌లోని రాధాకృష్ణ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అమిత్‌ త్రివేది అనే కస్టమర్‌ మైసూర్‌ మసాలా దోశలో చిన్న ఎలుక కనిపించిందని గతంలో ఆరోపించారు. దోశలో కొన్ని ముక్కలు తిన్న తర్వాత అది కనిపించడంతో పలుమార్లు వాంతులు చేసుకున్నానని ఆయన పేర్కొన్నారు.

ఎఫ్‌డీఏ రంగంలోకి..

ఈ ఘటనపై త్రివేది బోరివలీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు విషయాన్ని మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలనా విభాగం (ఎఫ్‌డీఏ) దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్‌డీఏ అధికారులు హోటల్‌పై చర్యలు తీసుకున్నారు. అనంతరం హోటల్‌ లైసెన్సును కూడా నిలిపివేశారు. దీంతో తొలుత ఈ వ్యవహారం ఆహార భద్రతకు సంబంధించిన అంశంగా మారింది.

తెర‌మీద‌కు రూ.25 లక్షల డీల్

అక్టోబర్‌ 5న కేసు మరో మలుపు తిరిగింది. బోరివలీ పోలీస్‌ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్లు 308(2), 3(5) కింద వసూళ్లు, బెదిరింపులకు సంబంధించిన కేసు నమోదైంది. హోటల్‌తో వివాదాన్ని ముగించేందుకు ‘ఫుల్‌ అండ్‌ ఫైనల్‌ సెటిల్‌మెంట్‌’గా రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలుక కనిపించిందని ఆరోపించిన వ్యక్తితో తమకు సంబంధం ఉందంటూ ఇద్దరు మహిళలు హోటల్‌ యాజమాన్యాన్ని సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మ‌ళిళ‌ల‌ పాత్ర ఏమిటి? రూ.25 లక్షల డిమాండ్‌ ఎలా వచ్చింది? సెటిల్‌మెంట్‌ కోసం ఏమైనా పత్రాలు ఇచ్చారా? వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అసలు దోశలో ఎలుక ఎక్క‌డిది ?

మరోవైపు కేసులో కీలకమైన మరో ప్రశ్నపైనా పోలీసులు దృష్టి సారించారు. నిజంగానే దోశలో ఎలుక కనిపించిందా? లేక ఎవరైనా కావాలనే దాన్ని దోశలో ఉంచారా? అన్నది కూడా దర్యాప్తులో భాగంగా మారింది.హోటల్‌ నిర్లక్ష్యం వల్ల ఎలుక ఆహారంలోకి వచ్చిందా? లేక ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉంచారా? అనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదని పోలీసులు తెలిపారు.

పోలీసుల దర్యాప్తు ముమ్మరం

ఈ కేసు దర్యాప్తును పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ దిగ్విజయ్‌ అశోక్‌ పాటిల్‌కు అప్పగించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, ఫిర్యాదుదారుడి వాదనలు, సెటిల్‌మెంట్‌ డిమాండ్‌, సంబంధిత వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలు తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పండుగల సీజన్‌ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, డెయిరీలపై ఎఫ్‌డీఏ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో తొలుత ఆహార భద్రత అంశంగా మొదలైన వ్యవహారం ఇప్పుడు వసూళ్ల ఆరోపణల కేసుగా కొత్త మలుపు తిరిగింది. దోశలో ఎలుక కనిపించిందన్న ఆరోపణ నిజమా? రూ.25 లక్షల డిమాండ్‌ వెనుక అసలు కథేంటి? అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.