Srisailam Reservoir: శ్రీశైలం రిజర్వాయర్‌కు అరుదైన గౌరవం..

‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు!

Srisailam Reservoir: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, ప్రాజెక్టు అయిన శ్రీశైలం రిజర్వాయర్ ప్రపంచ స్థాయిలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్టు అద్భుతమైన నిర్మాణ శైలి, దృఢత్వానికి గుర్తింపుగా ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ (World Book of Records) లో చోటు దక్కించుకుంది. నేడు డ్యామ్ అధికారులు శ్రీశైలంలో ఈ ప్రతిష్టాత్మక రికార్డు సర్టిఫికెట్‌ను అందుకోనున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేకతలు & రికార్డు విశేషాలు..

దక్షిణాసియాలోనే అతిపెద్ద క్రస్ట్ గేట్లు: దక్షిణాసియాలోనే ఏ ఇతర ప్రాజెక్టుకు లేని విధంగా శ్రీశైలం రిజర్వాయర్‌కు 60 అడుగుల వెడల్పు, 55 అడుగుల ఎత్తు కలిగిన అత్యంత భారీ క్రస్ట్ గేట్లను అమర్చారు.

సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో నిర్మాణం: భూమండలంలోనే అత్యంత ఎత్తులో, అంటే సముద్ర మట్టానికి దాదాపు 980 అడుగుల ఎత్తులో ఈ డ్యామ్‌ను నిర్మించడం దీని మరో ప్రసిద్ధ ఇంజనీరింగ్ విశేషం.

2009 నాటి ఆకాశమే హద్దుగా వచ్చిన వరదను తట్టుకున్న దృఢత్వం. 2009 అక్టోబర్ 2న శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో 25.4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి పడింది. నీరు డ్యామ్ పైనుంచి ఓవర్‌ఫ్లో అయినప్పటికీ, ప్రాజెక్టు రవ్వంత కూడా దెబ్బతినకుండా చెక్కుచెదరకుండా పటిష్టంగా నిలబడి తన ఇంజనీరింగ్ అద్భుతాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ అరుదైన రికార్డుతో శ్రీశైలం ప్రాజెక్టు ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరడంపై తెలుగు ప్రజలు, డ్యామ్ నిర్వహణ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.