Raptadu School Incident | రాప్తాడు ఘటన.. టీచర్‌ కన్నీళ్లు .. క్లాస్‌ రూంలో ఏం జరిగిందంటే..? (video)

అనంతపురం, ఆంధ్రప్రభ: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాల ఒక్కసారిగా భయానక ఘటనకు వేదికైంది. తరగతి గదిలో పాఠాలు చెబుతున్న సమయంలోనే ఓ దుండగుడు లోపలికి చొరబడి పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడికి తెగబడ్డాడు. కళ్ల ముందే జరిగిన ఈ దారుణాన్ని చూసి ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

పాఠాలు చెబుతుండగా చొరబడి..

పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు మ్యాథ్స్‌ క్లాస్‌ జరుగుతోంది. ఆ సమయంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తరగతి గదిలోకి ప్రవేశించాడు. తన వెంట ఓ పరికరాన్ని తీసుకొచ్చి నేరుగా ఓ విద్యార్థిని వద్దకు వెళ్లాడు. ఎవరూ ఊహించని విధంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో తరగతి గదిలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏం జరుగుతుందో అర్థంకాక విద్యార్థులు భయంతో కేకలు వేశారు. నా కళ్ల ముందే దాడి చేశాడు.. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన క్లాస్‌ టీచర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు మ్యాథ్స్‌ క్లాస్‌ చెబుతున్న సమయంలో దుండగుడు లోపలికి వచ్చాడని, ఏదో పరికరం తీసుకొచ్చి నేరుగా బాలిక వద్దకు వెళ్లాడని తెలిపారు.

‘నేను ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిపోయా. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నా కళ్ల ముందే అమ్మాయిపై దాడి చేశాడు. నేను ఏదైనా చేసేలోపే అంతా జరిగిపోయింది. రియాక్ట్‌ అయ్యేలోపే దాడి చేశాడు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తరగతి గదిలో విద్యార్థుల మధ్య ఇలాంటి ఘటన జరగడంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు వివరించారు.

అడ్డుకునేందుకు వెళ్లిన మరో బాలికకూ గాయాలు

ప్రధాన విద్యార్థినిపై దాడి జరుగుతుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో బాలిక కూడా గాయపడింది. ఈ దాడిలో ప్రధాన బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా చేయి, ముఖం, మెడ తదితర భాగాల్లో గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. గాయపడిన ఇద్దరు విద్యార్థినులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రధాన బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

పాఠశాలలోకి ఎలా వచ్చాడు?

పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. బయట వ్యక్తి రంపం వంటి పరికరంతో పాఠశాలలోకి వచ్చి నేరుగా తరగతి గదికి చేరుకోవడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతడిని ఎవరూ ఎందుకు అడ్డుకోలేకపోయారనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ ఘటనతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.