రాప్తాడు నిందితుడి కుడి కాలు తొలగింపు
గ్యాంగ్రీన్ కారణంగా శస్త్రచికిత్స..
అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : రాప్తాడులో పదో తరగతి బాలికపై రంపంతో దాడి చేసిన హేమంత్ కుడి కాలును వైద్యులు తొలగించారు. పోలీసుల కాల్పుల్లో అతని కాలికి బుల్లెట్ గాయాలు కావడంతో రక్తప్రసరణ నిలిచిపోయింది. దీంతో గ్యాంగ్రీన్ ఏర్పడింది. అలాగే వదిలేస్తే మిగతా భాగాల్లోని కణజాలం దెబ్బతిని ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో అనంతపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అర్ధరాత్రి తర్వాత శస్త్రచికిత్స నిర్వహించి మోకాలి కింది భాగాన్ని తొలగించారు. ఎడమ కాలికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హేమంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
