France-Debt-Crisis-Eurozone : అయ్యోరోపా..! Andhra Prabha Top Story

France-Debt-Crisis-Eurozone : అయ్యోరోపా..! Andhra Prabha Top Story

  • యూరోజోన్ గుండె ద‌డ‌ద‌డ‌
  • ఆగ‌ని విద్యార్థుల‌ ఆగ్ర‌హ‌జ్వాల‌!
  • ఇటు బడ్జెట్‌ లోటు ప‌రుగులు
  • అటు అప్పులు ఉరుకులు
  • బాండ్లపై పెరిగిన వడ్డీ రేట్లు
  • యూరో ప్ర‌పంచంపై తీవ్ర ప్ర‌భావం

(లండన్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి):

ఫ్రాన్స్‌.. ఐరోపాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ ఇప్పుడు అదే దేశం ఆర్థిక ఒత్తిళ్లతో సతమతమవుతోంది. ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతోంది. అప్పులు కొండలా పేరుకుపోతున్నాయి. మరోవైపు ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సామాజిక ఆందోళనలకు దారితీస్తున్నాయి. తాజాగా విద్యార్థుల నిరసనలు ఈ పరిస్థితిని మరింత స్పష్టంగా ప్రపంచం ముందుంచాయి.
ఫ్రాన్స్‌ ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందంటే.. జూన్‌ నాటికి దేశ ప్రభుత్వ రుణభారం నాలుగు ట్రిలియన్‌ డాలర్లను దాటింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కంటే ఎక్కువ. అప్పులపై చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా గత ఏడాదితో పోలిస్తే బిలియన్ల డాలర్ల మేర పెరిగింది. బాండ్లపై రాబడులు (యీల్డ్స్‌) పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా మారింది.

ఖజానాపై తీవ్ర‌ ఒత్తిడి

ఒకవైపు అప్పుల భారం.. మరోవైపు ప్రభుత్వ ఖర్చులు అంతకంతకూ పెరుగుతున్నాయి. జనాభా వృద్ధాప్యానికి చేరుకుంటుండటంతో పెన్షన్ల కోసం భారీగా నిధులు కేటాయించాల్సి వస్తోంది. అదే సమయంలో రక్షణ రంగంపై వ్యయాన్ని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఖర్చులను నియంత్రించాలన్న ప్రయత్నాలు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలల్లో సిబ్బంది కొరత, తరగతి గదుల్లో రద్దీ, శిథిలావస్థకు చేరిన మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు ఫ్రాన్స్‌లో ఆర్థిక సంస్కరణలు సామాజిక నిరసనలకు దారితీయడం ఇదే తొలిసారి కాదు. 2023లో పదవీ విరమణ వయసును పెంచేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనలు జరిగాయి.

ఇటు కోతలు.. అటు పన్నుల పెంపుద‌ల‌

బడ్జెట్‌ లోటును తగ్గించేందుకు ఫ్రెంచ్‌ ప్రభుత్వం గత వారం భారీ వ్యయ కోతలు, పన్నుల పెంపుతో కూడిన ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. అయితే వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందు పార్లమెంటులో ఈ చర్యలు బలహీనపడే అవకాశం ఉందన్న ఆందోళన బాండ్‌ మార్కెట్‌ పెట్టుబడిదారుల్లో నెలకొంది.
క్యాపిటల్‌ ఎకనామిక్స్‌ సంస్థ చీఫ్‌ యూరోపియన్‌ ఎకనామిస్ట్‌ ఆండ్రూ కెన్నింగ్‌హామ్‌ ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ఆర్థిక క్రమశిక్షణపై అనిశ్చితి పెరగవచ్చని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ స్థానంలో వామపక్ష లేదా మితవాదానికి భిన్నమైన రాజకీయ శక్తుల నుంచి కొత్త అధ్యక్షుడు రావొచ్చన్న రాజకీయ అనిశ్చితి కూడా ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో మారిన్‌ లె పెన్‌ నేతృత్వంలోని నేషనల్‌ ర్యాలీ పార్టీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించేందుకు వ్యయ కోతలను ప్రతిపాదించినప్పటికీ.. ఖరీదైన పన్ను తగ్గింపులకూ మద్దతు ఇస్తోందని కెన్నింగ్‌హామ్‌ పేర్కొన్నారు.

బాండ్ల మార్కెట్‌లో ప్రకంపనలు

ఫ్రాన్స్‌ రుణ సంక్షోభం ముప్పుపై ఆందోళనలు గత వారం ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఫ్రెంచ్‌ ప్రభుత్వ బాండ్ల విక్రయాలు భారీగా పెరిగి.. వాటి యీల్డ్స్‌ గణనీయంగా ఎగిశాయి. ఫ్రాన్స్‌, జర్మనీ ప్రభుత్వ బాండ్ల యీల్డ్స్‌ మధ్య వ్యత్యాసం 2012 తర్వాత ఎన్నడూ లేనంత స్థాయికి చేరింది. అంటే.. జర్మనీతో పోలిస్తే ఫ్రాన్స్‌ అప్పులను కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారులు మరింత అధిక రాబడిని కోరుతున్నారన్నమాట. జర్మనీని యూరప్‌లో సాపేక్షంగా సురక్షితమైన రుణ మార్కెట్‌గా పరిగణిస్తారు. ఫ్రెంచ్‌ బాండ్‌ మార్కెట్‌లో నెలకొన్న ఈ పరిస్థితి ఇప్పుడు ఇతర యూరోపియన్‌ దేశాలపై కూడా ప్రభావం చూపొచ్చన్న భయాలను పెంచింది. కొందరు విశ్లేషకులు దీనిని 2010ల ప్రారంభంలో యూరోజోన్‌ రుణ సంక్షోభంతో పోలుస్తున్నారు.

‘వ్యాప్తి చెందితే తీవ్ర పరిణామాలు’

ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం, యూరోజోన్‌లో దాని ప్రాధాన్యం దృష్ట్యా.. అక్కడి రుణ మార్కెట్‌ సమస్యలు ఇతర దేశాలకు వ్యాపించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ చీఫ్‌ యూరోపియన్‌ ఎకనామిస్ట్‌ ఏంజెల్‌ తలవేరా పేర్కొన్నారు. ఈ ఆందోళనల ప్రభావం యూరోపై కూడా పడింది. సోమవారం అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే యూరో విలువ 2025 మే తర్వాత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఒక దశలో యూరో విలువ 1.12 డాలర్ల దిగువకు కూడా చేరింది.

ఐరోపా ఆర్థిక పునరుద్ధరణకు సవాల్‌

ఫ్రాన్స్‌లో తాజా పరిణామాలు అక్కడికే పరిమితం కాకుండా మొత్తం యూరప్‌ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పెట్టుబడులు, యూరోపియన్‌ ఎగుమతులకు పెరుగుతున్న డిమాండ్‌, జర్మనీలో రక్షణ వ్యయం పెరగడం వంటి అంశాలు ఐరోపా ఆర్థిక పునరుద్ధరణకు కొంత ఊతమిస్తున్నాయి. ఇటీవల వెలువడిన సర్వేలు కూడా యూరోజోన్‌లో తయారీ, సేవల రంగ కార్యకలాపాలు దాదాపు మూడున్నరేళ్లలోనే అత్యంత వేగంగా పెరిగినట్లు సూచించాయి.‘ఐరోపా ఆర్థిక వృద్ధి మళ్లీ పుంజుకుంటోంది. ఊహించిన దానికంటే ఐరోపా ఎక్కువ స్థైర్యాన్ని చూపుతోంది’ అని మోర్గాన్‌ స్టాన్లీ ఆర్థికవేత్తలు సెప్టెంబర్‌ చివర్లో పేర్కొన్నారు.అయితే పెరుగుతున్న బాండ్‌ యీల్డ్స్‌ ఈ వృద్ధికి పెద్ద ముప్పుగా మారుతున్నాయి.

వడ్డీ రేట్లు మరింత పెరిగే ప్రమాదం

ప్రభుత్వాలు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టకపోతే వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని డచ్‌ బ్యాంక్‌ ఐఎన్‌జీకి చెందిన మాక్రో ఎకనామిక్స్‌ విభాగం అధిపతి కార్‌స్టెన్‌ బ్రెజ్‌స్కీ హెచ్చరించారు.బాండ్‌ యీల్డ్స్‌ పెరిగితే ఆర్థిక వ్యవస్థ మొత్తం రుణ వ్యయం పెరుగుతుంది. గృహాలు, కార్ల కొనుగోళ్లకు తీసుకునే రుణాలు ఖరీదవుతాయి. పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలకు కూడా అప్పులు సమీకరించడం మరింత భారంగా మారుతుంది.యీల్డ్స్‌ను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వాలు ఖర్చులను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై పొదుపు చర్యల భారం పడే అవకాశం ఉంటుంది.

ఇటీవల ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌ ప్రభుత్వ బాండ్ల యీల్డ్స్‌ కూడా అనేక సంవత్సరాల గరిష్ఠ స్థాయులను తాకాయి. ప్రభుత్వాల అప్పుల భారం ఎంతవరకు నిలకడగా ఉంటుంది? అనే ప్రశ్న ఇప్పుడు యూరప్‌ ఆర్థిక వర్గాలను వెంటాడుతోంది.యూరప్‌ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలు యూరోజోన్‌ ఆర్థిక మార్కెట్లకు, మొత్తం ఆర్థిక వ్యవస్థకు ‘తీవ్రమైన ముప్పులను’ కలిగిస్తున్నాయని క్యాపిటల్‌ ఎకనామిక్స్‌ డిప్యూటీ చీఫ్‌ యూరోజోన్‌ ఎకనామిస్ట్‌ జాక్‌ అలెన్‌-రేనాల్డ్స్‌ పేర్కొన్నారు.