Ranabaali | విజయ్ గురించి రష్మిక మనసులోని మాట!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సినీ పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతోనే కాదు, ఆఫ్-స్క్రీన్ బాండింగ్తోనూ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఈ రియల్ లైఫ్ జోడీ.. ఇప్పుడు వెండితెరపై మళ్లీ మాయ చేయడానికి సిద్ధమవుతోంది. పెళ్లి తర్వాత ఈ జంట మొదటిసారిగా కలిసి నటిస్తున్న భారీ పీరియడ్ డ్రామా ‘రణబాలి’ .
అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్, రష్మిక మందన్న పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, రష్మిక ‘గీత గోవిందం’ రోజుల నాటి జ్ఞాపకాలను నెరువేసుకుంటూ.. విజయ్ తన జీవితాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎలా మార్చేశారో ఆమె ఎమోషనల్ అయ్యారు.
ఒకప్పుడు తాను ఎంతో రిజర్వ్డ్గా ఉండేదానినని, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేదాన్ని కాదని రష్మిక గుర్తుచేసుకున్నారు. “నా అసలు వ్యక్తిత్వం ఎప్పటికీ మారలేదు, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. కానీ ఒకప్పుడు నాకు ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉండేది. ఎవరి కళ్లలోకి సూటిగా చూసేదాన్ని కూడా కాదు” అంటూ తన గతం గురించి మనసు విప్పారు.
అలాంటి సమయంలోనే విజయ్ దేవరకొండ తన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చారని ఆమె తెలిపారు. ‘గీత గోవిందం’ షూటింగ్ సమయంలో విజయ్ మాట్లాడే తీరు, ఆయన వేసే అడుగులు, ఆయనకున్న అపారమైన ఆత్మవిశ్వాసాన్ని చూసి తాను ఎంతగానో ఆరాధించానని చెప్పారు. “ఆయనను చూసి.. నా జీవితంలో కూడా నేను అలా ఉండగలిగితే బాగుండు అని అనుకునేదాన్ని. ఒక నటుడిగా ఆయన ప్రవర్తన, ఆత్మవిశ్వాసం నన్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి” అని రష్మిక పేర్కొన్నారు.
విజయ్ తన వెన్నుతట్టి ప్రోత్సహించిన తీరును చెబుతూ రష్మిక భావోద్వేగానికి గురయ్యారు. “నువ్వు అనుకుంటున్న దానికంటే ఎంతో ఎక్కువ సాధించగల సామర్థ్యం నీకు ఉంది అని విజయ్ నాకు తరచుగా చెబుతుండేవేవారు. నిజం చెప్పాలంటే, ఆ మాటలను పూర్తిగా నమ్మడానికి నేను ఇప్పటికీ కాస్త ఇబ్బంది పడుతుంటాను. కానీ, ఆయన నాపై ఉంచిన ఆ నమ్మకమే నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకువచ్చింది” అని తెలిపారు. ఇప్పటికీ తాను విజయ్‌ని అదే మాట అడుగుతుంటానని, ఆ విషయంలో ఏనాడు మార్పు రాకూడదని కోరుకుంటున్నానని ఆమె ముగించారు.
రీయల్ లైఫ్ టూ రీల్ లైఫ్
ఫిబ్రవరి 26, 2026న ఈ జంట వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పెళ్లి తర్వాత మొదటిసారిగా తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. టాలెంట్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న భారీ పీరియడ్ డ్రామా ‘రణబాలి’. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
