ఆటో సైడ్ ఇవ్వలేదని.. నడిరోడ్డుపై బీభత్సం!
- ఆటో డ్రైవర్‌పై దాడి.. అడ్డుకున్న పోలీసులతోనూ వాగ్వాదం
- నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
భూపాలపల్లి టౌన్, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జవహర్‌నగర్ కాలనీ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ప్యాసింజర్ ఆటో డ్రైవర్‌పై బొలెరో వాహనంలో వచ్చిన పలువురు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
స్థానికుల కథనం ప్రకారం.. కాళేశ్వరం వైపు నుంచి భావుసింగ్‌పల్లికి వెళ్తున్న బొలెరో వాహనానికి ఆటో సైడ్ ఇవ్వలేదన్న కారణంతో జవహర్‌నగర్ ఎంఆర్ఎఫ్ షోరూమ్ సమీపంలో ఆటోను అడ్డగించి డ్రైవర్‌పై దాడి చేసినట్లు తెలిసింది. అయితే వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 100కు డయల్ చేయడంతో బ్లూకోట్స్ సిబ్బంది అక్కడికి చేరుకోగా.. వారితోనూ దాడికి దిగిన వారు దురుసుగా వ్యవహరించినట్లు స్థానికులు పేర్కొన్నారు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న భూపాలపల్లి ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసి దాడి చేసిన నలుగురిని అదుపులోకి తీసుకుని భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.
