20నెలలకు పూర్తిస్థాయి అధికారి నియామకం..
జన్నారం, జూన్ 14 (ఆంధ్రప్రభ ): ఉమ్మడి జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్ లోని మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజనల్ అధికారి (Forest Divisional Officer) (ఎఫ్డీఓ) గా ఎం.రామ్మోహన్ ను రాష్ట్ర ముఖ్య అటవీశాఖ అధికారిణి సి.సువర్ణ నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రామ్మోహన్ హైదరాబాద్ లోని దూలపల్లి శిక్షణ అకాడమీలో రేంజ్ ఆఫీసర్ హోదాలో ఉంటూ, కోర్స్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10మంది సీనియర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు ప్రభుత్వ ఆదేశాల (Government orders) మేరకు పదోన్నతి కల్పించారు.
అందులో రామ్మోహన్ కు రేంజ్ ఆఫీసర్ (Range Officer) నుంచి ఎఫ్డీఓగా పదోన్నతి కల్పిస్తూ జన్నారం ఫారెస్ట్ డివిజనల్ అధికారిగా నియమించారు. గత 2023అక్టోబర్ లో ఇక్కడ ఎఫ్డీఓగా పనిచేసిన ఎస్.మాధవరావును హైదరాబాద్ రాష్ట్ర ముఖ్య అటవీశాఖ కార్యాలయానికి బదిలీ చేశారు. అప్పటి నుంచి గత 20 నెలలుగా మంచిర్యాల డీఎఫ్ఓ శివ్ఆశిష్ సింగ్ అదనపు బాధ్యతలతో ఇన్చార్జి ఎఫ్డీఓ విధులు నిర్వర్తిస్తున్నారు.
ఎట్టకేలకు పదోన్నతి పొందిన రామ్మోహన్ ను జన్నారం ఎఫ్డీఓగా నియమించారు. ఆయన గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని బెజ్జూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా పనిచేశారు. ప్రస్తుతం దూలపల్లి శిక్షణ అకాడమీలో కోర్సు డైరెక్టర్ (Course Director) గా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో రామ్మోహన్ కు నిక్కచ్చిగా వ్యవహరించే నిబద్ధత గల అధికారిగా, అడవులు, వన్యప్రాణుల చట్టాలపై పూర్తి అవగాహన కలిగిన మంచి పేరుంది.