ramgopal| జాహ్న‌వి ఏఐ మార్ఫింగ్‌ వీడియోపై ఆర్జీవీ ఫైర్‌..

జాహ్న‌వి ఏఐ మార్ఫింగ్‌ వీడియోపై ఆర్జీవీ ఫైర్‌..

  • అభ్యంతరకర కంటెంట్‌కు సెలబ్రిటీలే మరింత ప్రచారం కల్పించారంటూ వ్యాఖ్యలు
  • బాధితురాలి గుర్తింపును బయటపెట్టడం, మార్ఫింగ్‌ కంటెంట్‌ను ప్రచారం చేయడం తప్పేనని ఆర్జీవీ అభిప్రాయం

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన విజువల్స్‌ను కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న ఘటనపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. అభ్యంతరకరమైన ఏఐ కంటెంట్‌ను రూపొందించి ప్రచారం చేసిన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి.. దాని గురించి విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

నిందితుడిని పట్టుకోవడంపై దృష్టి పెట్టాలి
ఈ వ్యవహారంపై స్పందించిన ఆర్జీవీ.. అభ్యంతరకరమైన లింక్‌ను సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్‌ చేయడం వల్ల కోట్లాది మంది దృష్టికి ఆ కంటెంట్‌ వెళ్లే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. వాస్తవానికి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు చేయాల్సింది ఆ కంటెంట్‌ను ఎలా తొలగించాలి? దాన్ని రూపొందించిన వ్యక్తిని ఎలా గుర్తించి పట్టుకోవాలి? అనే అంశాలపై దృష్టి పెట్టడమేనని అభిప్రాయపడ్డారు.
నిందితుడిని గుర్తించి అరెస్టు చేసిన విషయాన్ని ప్రజలకు తెలియజేస్తే అది బాధ్యతాయుతమైన స్పందనగా ఉండేదని పేర్కొన్నారు. కానీ అభ్యంతరకరమైన కంటెంట్‌ గురించి పదేపదే పోస్టులు చేయడం, లింకులు ప్రస్తావించడం వల్ల దానికి అనవసరమైన ప్రచారం లభిస్తుందని అన్నారు.

బాధితురాలి గుర్తింపును బయటపెట్టొద్దు
ఏఐ మార్ఫింగ్‌ వంటి ఘటనల్లో బాధితురాలి గోప్యత, గౌరవాన్ని కాపాడటం అత్యంత ముఖ్యమని ఆర్జీవీ పేర్కొన్నారు. బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయడం లేదా అభ్యంతరకరమైన కంటెంట్‌ను మళ్లీ షేర్‌ చేయడం వల్ల బాధితురాలికి మరింత మానసిక వేదన కలిగే అవకాశం ఉందన్నారు.
అలాగే, అభ్యంతరకరమైన వీడియోలు, ఫొటోలు లేదా వాటి లింకులను వైరల్‌ చేయడం సమస్యకు పరిష్కారం కాదని పేర్కొన్నారు. వాటిని తొలగించడం, మూలాన్ని గుర్తించడం, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే సరైన మార్గమని సూచించారు.

ప్రచారం కాదు.. చర్యలు కావాలి
ఏఐ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఒక వ్యక్తి ఫొటో లేదా వీడియోను మార్ఫింగ్‌ చేసి అసభ్యకర కంటెంట్‌గా మార్చడం సులభమవుతోంది. ఇలాంటి కంటెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయితే బాధితులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందువల్ల సోషల్‌ మీడియా వినియోగదారులు అలాంటి కంటెంట్‌ను చూడటం, డౌన్‌లోడ్‌ చేయడం, ఫార్వర్డ్‌ చేయడం లేదా లింకులను షేర్‌ చేయకుండా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.