Ramayana Movie | గూస్‌బంప్స్ తెప్పిస్తున్న హనుమంతుడి ఎంట్రీ! ( Video)

ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి: భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దాదాపు రూ.2,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్‌లో గ్రాఫిక్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా చిత్రబృందం మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమాలోని కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాన్ని వీడియో రూపంలో విడుదల చేసింది.

ఈ సినిమా మొదటి భాగం చివర్లో హనుమంతుడి పాత్రను పరిచయం చేస్తూ దర్శకుడు ఆసక్తిని పెంచారు. అయితే ఆ సన్నివేశంలో హనుమంతుడి ముఖాన్ని పూర్తిగా చూపించకుండా సస్పెన్స్‌లో ఉంచారు. హనుమంతుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కనిపించనున్న విషయం తెలిసిందే.

తాజాగా విడుదలైన ‘శ్రీ హనుమాన్ చాలీసా’ వీడియో సాంగ్‌లో ఆ సన్నివేశాన్ని పూర్తిగా చూపించారు. యూట్యూబ్‌లో విడుదలైన ఈ వీడియో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా హనుమంతుడి రూపం, ఆయన ఎంట్రీ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

రాముడిపై హనుమంతుడికి ఉన్న భక్తి, ఆయన చూపించే ధైర్యం, చెడుపై చేసే పోరాటం వెండితెరపై ఎలా ఉండబోతున్నాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా లంకా దహనం, రావణుడి సేనతో హనుమంతుడి పోరాటం వంటి సన్నివేశాలను పెద్ద తెరపై చూడాలని సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే హనుమంతుడి పూర్తి స్థాయి విన్యాసాలను చూడాలంటే 2028 వరకు వేచి చూడాల్సిందే. సినిమా తదుపరి భాగంలో ఆయన పాత్ర మరింత కీలకంగా ఉండనుంది.

నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఇతిహాస చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. ఇక హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించనున్నారు. హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించడం మరో ప్రత్యేకత. భారీ విజువల్స్, అద్భుతమైన సంగీతం, ప్రముఖ నటీనటుల అభినయంతో ‘రామాయణం’ ప్రేక్షకులకు సరికొత్త సినిమా అనుభూతిని అందిస్తోంది.