Ramayana | రామాయణం సినిమాపై రాజమౌళి రివ్యూ.. ఏమన్నారంటే!

ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి: నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘రామాయణం’. వెండితెరపై భారతీయ ఇతిహాసాన్ని సరికొత్త ప్రపంచంలో ఆవిష్కరించే ప్రయత్నం చేసిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమాపై దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి స్వయంగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సినిమాలోని విజువల్స్, నటీనటుల అభినయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణం’ భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ సినిమా చూసిన రాజమౌళి.. తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సినిమా భారీతనం, వెండితెరపై కనిపించే దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించే విజువల్ గ్రాండియర్ తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు.

ఈ చిత్రంలోని నటీనటులపై కూడా రాజమౌళి ప్రత్యేకంగా స్పందించారు. రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా కనిపించారని ప్రశంసించారు. ముఖ్యంగా వనవాసం నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో ఆయన నటన మెప్పించిందన్నారు.మరోవైపు రావణుడి పాత్రలో యశ్ అధ్బుతంగా నటించారని అన్నారు. సీత పాత్రలో సాయి పల్లవి ఎంతో హుందాగా కనిపించారని ప్రశంసించారు.

సినిమాలో తనకు బాగా నచ్చిన అంశాల గురించి కూడా రాజమౌళి ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. సినిమా చివరి భాగం ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారని ప్రశంసించారు. ఇంతటి భారీ ఇతిహాసాన్ని తెరపైకి తీసుకురావడం సాధారణ విషయం కాదని, ఈ ప్రతిష్టాత్మక ప్రయత్నాన్ని ఇంత అందంగా రూపొందించిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేష్ తివారీతో పాటు చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.