Ramayana Movie Review | వెండితెరపై విజువల్ సునామీ.. నితీష్ తివారీ ‘రామాయణం’ ఎలా ఉందంటే?
ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి: రామాయణం.. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా తనివితీరని దృశ్యకావ్యం. తరాలు మారినా, కాలం మారినా ఈ ఇతిహాసానికి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గదు. ఇప్పటివరకు సినీ ప్రపంచంలో ఎంతోమంది దర్శకులు రామాయణ గాథను తమదైన శైలిలో వెండితెరపై ఆవిష్కరించారు. మన చిన్నప్పటి నుంచి రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడి కథలను ఎన్నో రూపాల్లో చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ మరోసారి అదే కథను చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. అలాంటి ఆసక్తిని మరింత పెంచుతూ దర్శకుడు నితీష్ తివారీ ఈసారి రామాయణాన్ని భారీ విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. టీజర్, ట్రైలర్లతోనే భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? రామాయణాన్ని మరోసారి కొత్తగా చెప్పడంలో దర్శకుడు ఎంతవరకు సఫలమయ్యారు? రణబీర్ రాముడిగా, యశ్ రావణుడిగా ఎలా మెప్పించారు? ఈ సమీక్షలో తెలుసుకుందాం.
రామాయణం అందరికీ తెలిసిన కథే. చిన్నప్పటి నుంచి వింటున్న కథే. అయితే దర్శకుడు నితీష్ తివారీ ఈసారి కథను రాముడి నుంచి కాకుండా రావణుడి నేపథ్యం నుంచి ప్రారంభించారు. రావణుడి కుటుంబం దేవతల ఆధిపత్యం కారణంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటుంది. తమ రాజ్యాన్ని, అసురుల ఉనికిని తిరిగి చాటుకోవాలని రావణుడు ఘోర తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు దేవతలు, అసురుల చేతిలో తనకు మరణం సంభవించకూడదని వరం కోరుకుంటాడు.
బ్రహ్మ ఇచ్చిన వరంతో అపారమైన శక్తిని సంపాదించిన రావణుడు తిరిగి లంకను తన వశం చేసుకుంటాడు. ఆ తర్వాత దేవతలపై యుద్ధానికి దిగుతాడు. రావణుడి ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి విష్ణుమూర్తి భూమిపై మానవ రూపంలో రాముడిగా అవతరిస్తాడు. అక్కడి నుంచి రాముడి బాల్యం, సీతతో వివాహం, వనవాసం, సీతాపహరణం వంటి మనకు తెలిసిన ఘట్టాలు తెరపై ఆవిష్కృతమవుతాయి. అయితే ఇక్కడ దర్శకుడు చేసిన ప్రయత్నం కొంత కొత్తగా అనిపిస్తుంది. రామాయణం అంటే కేవలం రాముడి గొప్పతనం మాత్రమే కాదు.. రావణుడి నేపథ్యం, అతడి పరాక్రమం, అహంకారం, కుటుంబం వంటి అంశాలను కూడా చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రావణుడి బాల్యం, అతడి కుటుంబ పరిస్థితులు, లంకాధిపతిగా ఎదిగిన తీరు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తాయి.
మనకు తెలిసిన కథను మరోసారి చెబుతున్నప్పుడు కొత్తదనం చూపించడం అంత సులభం కాదు. కానీ దర్శకుడు కథ ప్రారంభం నుంచే రావణుడి పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ఒకవైపు రావణుడి దర్పం, మరోవైపు రాముడి ధర్మం.. ఈ రెండు కోణాల మధ్య కథను నడిపించిన తీరు బాగుంది.
విజువల్స్ సినిమాకు ప్రధాన బలం
ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం విజువల్స్. రామాయణం వంటి ఇతిహాసాన్ని తెరపై చూపించాలంటే సాధారణమైన సెట్టింగులు సరిపోవు. అయోధ్య, మిథిల, లంక వంటి రాజ్యాల వైభవం నుంచి దేవతల లోకాలు, యుద్ధభూముల వరకు ప్రతి అంశాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చూపించాల్సి ఉంటుంది. ఈ విషయంలో చిత్రబృందం భారీగా శ్రమించినట్లు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది.
రాజభవనాలు, ప్రకృతి అందాలు, అద్భుతమైన నిర్మాణాలు, యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ముఖ్యంగా లంక వైభవాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. తెరపై కనిపించే ప్రపంచం కేవలం సెట్టింగులకే పరిమితం కాకుండా ఓ భారీ ఫాంటసీ ప్రపంచంలా అనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల కంప్యూటర్ గ్రాఫిక్స్ సహజత్వానికి కొంత దూరంగా అనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని రాక్షస పాత్రల రూపకల్పనలో కృత్రిమత్వం కనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ సినిమా విజువల్ స్థాయి మాత్రం ఆకట్టుకుంటుంది.
రామాయణంలో రాముడు, సీత మధ్య అనుబంధం అత్యంత కీలకం. వారి ప్రేమ, అనురాగం, పరస్పర గౌరవం, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలిచే తీరు కథకు ప్రాణం. ఈ సినిమాలో కూడా వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా సీత పాత్రను చూపించిన విధానం ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇప్పటివరకు సీతాదేవిని ఎంతో సౌమ్యంగా, సహనానికి ప్రతిరూపంగా చూస్తూ వచ్చాం. కానీ ఈ సినిమాలో ఆమెను ధైర్యవంతురాలిగా, అవసరమైన సందర్భాల్లో తన శక్తిని చాటుకునే యోధురాలిగా చూపించే ప్రయత్నం చేశారు. సాయిపల్లవి నటన ఈ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే రాముడు, సీత మధ్య భావోద్వేగ అనుబంధాన్నిమరి కాస్తా లోతుగా చూపిస్తే బాగుండేదనిపిస్తుంది.
కీలకంగా శూర్పణఖ ఎపిసోడ్..
రామాయణంలో శూర్పణఖ ఘట్టం ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ, రావణ యుద్దానికి అజ్యం పోసింది ఆమె. ఈ సినిమాలో శూర్పణఖ పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటివరకు మనకు తెలిసిన శూర్పణఖ కథ అంటే లక్ష్మణుడు ఆమె ముక్కు కోయడం, ఆ తర్వాత ఆమె రావణుడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పడం వరకే. కానీ ఈ సినిమాలో ఆమె నేపథ్యం, కుటుంబ పరిస్థితులు, వ్యక్తిత్వం వంటి అంశాలను కూడా పరిచయం చేసే ప్రయత్నం చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆమెకు దక్కిన పాత్ర కథలో కీలకంగా మారుతుంది.
15 నిమిషాల జటాయువు, రావణుడి పోరాటం..
సినిమా చివరి అంకంలో వచ్చే జటాయువు, రావణుడి మధ్య యుద్ధం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సీతను అపహరించి తీసుకెళ్తున్న రావణుడిని జటాయువు అడ్డుకోవడం, తన శక్తికి మించి పోరాడటం వంటి సన్నివేశాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ ఘట్టం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆకాశంలో జరిగే పోరాటం, విజువల్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం ఈ సన్నివేశానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. ముఖ్యంగా జటాయువు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సీతను రక్షించడానికి ప్రయత్నించే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. సీతాపహరణం, జటాయువు మరణంతో సినిమా తొలి భాగం ముగుస్తుంది. రెండో భాగంపై ఆసక్తిని పెంచేలా ఈ ముగింపు ఉంటుంది.
ఎవరు ఎలా నటించారంటే?
రణబీర్ కపూర్ రాముడి పాత్రలో పూర్తిగా లీనమయ్యారు. రాముడి పాత్రలో ఉండాల్సిన ప్రశాంతత, హుందాతనం, ధర్మబద్ధమైన వ్యక్తిత్వాన్ని తన నటనతో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన బాగుంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నారు. సీతగా సాయిపల్లవి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఆమెకు ఉన్న సహజమైన నటన ఈ పాత్రకు బాగా సరిపోయింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో తనదైన ముద్ర వేశారు. సీత పాత్రలోని ధైర్యం, సహనం, ఆత్మవిశ్వాసాన్ని చక్కగా చూపించారు.
ఇక రావణుడిగా యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి భాగంలో ఆయన పాత్రే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రావణుడి పరాక్రమం, రాజసం, అహంకారం, ఆవేశం వంటి భావాలను తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో అద్భుతంగా పలికించారు. ముఖ్యంగా రావణుడి పాత్ర పరిచయం నుంచి అతడి శక్తి సామర్థ్యాలను చూపించే సన్నివేశాల వరకు యశ్ తనదైన ముద్ర వేశారు. కొన్ని సందర్భాల్లో రాముడి పాత్ర కంటే రావణుడి పాత్ర ఎక్కువగా గుర్తుండిపోతుంది.
శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్‌కు మంచి పాత్ర దక్కింది. కథలో ఆమె పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని తన నటనతో నిలబెట్టుకున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే తన పాత్ర పరిధి మేరకు మెప్పించారు. రావణుడి తల్లి కైకసిగా శోభన కూడా ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సినిమా ఎలా ఉందంటే..
తెలిసిన కథను మరోసారి తెరపై చూపించేటప్పుడు ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా కూర్చోబెట్టడం దర్శకుడికి పెద్ద సవాల్. ఈ విషయంలో నితీష్ తివారీ చేసిన ప్రయత్నం కొంతవరకు ఫలించింది. ముఖ్యంగా రావణుడి నేపథ్యంతో కథను ప్రారంభించడం కొత్తదనాన్ని తీసుకొచ్చింది. అయితే పాత్రల పరిచయానికి, వాటి నేపథ్యాన్ని వివరించడానికి ఎక్కువ సమయం కేటాయించడంతో తొలి భాగంలో కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు మరింత సంక్షిప్తంగా ఉంటే సినిమా వేగం పెరిగేది. అయినప్పటికీ రావణుడి పాత్ర చుట్టూ నడిచే కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థంలో వనవాసం, సీతాపహరణం, జటాయువు ఘట్టం వంటి సన్నివేశాలతో కథనం వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలు కలగలిపి చూపించడం బాగుంది.
సుమారు రూ.2,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా స్థాయి ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ వంటి అంశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రామాయణ ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా డబ్బింగ్ విషయంలో బ్రహ్మ ఏఐ ఉపయోగించడంతో ఎక్కడ డబ్బింగ్ సినిమా చూస్తున్నాం అనే భావన కలగదు.
సంగీతం విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. భారీ యుద్ధ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ప్రేక్షకులను మరో స్థాయికి తీసుకెళ్తుంది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ సంగీతం కథకు తగ్గట్టుగా సాగుతుంది. పాటలు కూడా కథలో భాగంగా వస్తూ సినిమాకు అనుగుణంగా సాగిపోతాయి.
చివరిగా..
రామాయణం వంటి ఇతిహాసాన్ని మరోసారి వెండితెరపై ఆవిష్కరించడం అంత సులభమైన విషయం కాదు. అందరికీ తెలిసిన కథలో కొత్తగా చూపించడంతో పాటు, ఆ కథలోని పవిత్రత, భావోద్వేగాలను కాపాడటం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో దర్శకుడు నితీష్ తివారీ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. అక్కడక్కడా కథనం నెమ్మదించడం, కొన్ని గ్రాఫిక్స్ సహజత్వానికి దూరంగా అనిపించడం వంటి లోపాలు ఉన్నప్పటికీ భారీ తెరపై చూడదగ్గ అనుభూతిని ఈ సినిమా అందిస్తుంది. ముఖ్యంగా రామాయణ కథను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి విజువల్ ట్రీట్.
రేటింగ్ : 3.5
