Ramayana Movie Release Date |రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’పై భారీ అప్‌డేట్..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: బాలీవుడ్‌ లో అత్యంత ప్రతిఫ్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘రామాయణ’. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ విషయంలో మరో కీలక అప్‌డేట్‌ ను చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6, 2026న విడుదల కానుంది. అయితే ఐదు దేశాల్లో మాత్రం ఈ సినిమా అంతకంటే ఒక రోజు ముందుగానే నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసకురానున్నారు మేకర్స్‌.

తాజా షెడ్యూల్ ప్రకారం థాయ్‌లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా దేశాల్లో ‘రామాయణం’ నవంబర్ 5నే విడుదల కానుంది. అంటే.. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న సినిమా విడుదలవుతుండగా, ఈ ఐదు దేశాల ప్రేక్షకులు మాత్రం రామాయణాన్ని ఒక రోజు ముందుగానే వెండితెరపై చూడబోతున్నారు. ఇలా వేర్వేరు దేశాల్లో వేర్వేరు తేదీల్లో సినిమా విడుదల చేయడానికి ప్రధాన కారణం అక్కడి అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ విధానమేనని నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు.

ఇక భారతీయ ప్రేక్షకుల కోసం సినిమా విడుదల తేదీ విషయంలో మేకర్స్ మరో వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. భారత్‌లో దీపావళి సందర్భంగా సినిమాను విడుదల చేయాలని ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నమిత్ మల్హోత్రా గతంలో వెల్లడించారు. 2026లో దీపావళి నవంబర్ 8న వస్తుండగా.. అంతర్జాతీయ మార్కెట్లలో శుక్రవారం రిలీజ్‌కు అనుగుణంగా నవంబర్ 6 తేదీని ఎంచుకున్నామని నమిత్ మల్హోత్రా తెలిపారు.

ప్రపంచం వైపు భారతీయ ఇతిహాసం..

‘రామాయణ’ను కేవలం భారతీయ ప్రేక్షకుల కోసం కాకుండా ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు. భారతీయ ఇతిహాసంలోని కథ, పాత్రలు, భావోద్వేగాలను అంతర్జాతీయ సినిమా స్థాయిలో పరిచయం చేయాలన్నది ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ప్రధాన ఆలోచనగా కనిపిస్తోంది.అందుకే బడ్జెట్ నుంచి టెక్నికల్ టీమ్ వరకు ప్రతిదీ భారీ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.