Ramayana | బాంబే హైకోర్టు సంచలన ఆదేశాలు!

ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి: భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో, పెద్ద అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ: రైజ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’. ఈ అద్భుత దృశ్యకావ్యానికి విడుదలకు ముందే పైరసీ ముప్పు నుంచి పెద్ద ఊరట లభించింది. ఆన్‌లైన్‌లో సినిమా కంటెంట్ లీకవకుండా, అనధికారికంగా ప్రసారం కాకుండా బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా చిత్రాన్ని రికార్డు చేయడం, అప్‌లోడ్‌ చేయడం, స్ట్రీమింగ్ లేదా పంపిణీ చేయడంపై స్పష్టమైన మధ్యంతర నిషేధం విధించింది.

న్యాయమూర్తి జస్టిస్‌ మాధవ్‌ జమ్‌దార్‌ నవంబర్‌ 2న ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ‘గాడ్‌పవర్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ దాఖలు చేసిన కాపీరైట్‌ ఉల్లంఘన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఎవరైనా సరే సినిమాను అక్రమంగా ప్రసారం చేయకుండా ఈ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది.

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కంటెంట్‌ ఇప్పటికే కొద్దిగా బయటికి రావడంతో చిత్ర యూనిట్ అప్రమత్తమైంది. జూలై 18న ఢిల్లీలోని భారత్‌ మండపంలో ఆహ్వానితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రివ్యూలో మొదటి ట్రైలర్‌ను ప్రదర్శించారు. గోప్యతా ఒప్పందాలు ఉన్నప్పటికీ.. కొందరు రహస్యంగా వీడియోలు రికార్డు చేసి సోషల్‌ మీడియాలో లీక్‌ చేశారు.

అక్టోబర్‌ 15న విడుదలైన రెండో ట్రైలర్‌లోని కొన్ని దృశ్యాలు సైతం అధికారిక విడుదలకు ముందే బయటకు వచ్చాయి. ఈ పరిణామాలతో అప్రమత్తమైన నిర్మాణ సంస్థ.. థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత పైరసీ మరింత పెరిగే అవకాశం ఉందని భావించి వెంటనే బాంబే హైకోర్టును ఆశ్రయించింది. సినిమా కాపీరైట్‌ పరిధిలో కేవలం పూర్తి నిడివి చిత్రమే కాకుండా.. స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, పాత్రలు, పాటలు, సంగీతం, ఆడియో రికార్డింగ్‌లు, విజువల్‌ ఎఫెక్ట్స్‌, ప్రచార చిత్రాలు కూడా వస్తాయని కోర్టుకు విన్నవించింది.

నిర్మాణ సంస్థ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. పైరసీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు (ISPs), టెలికాం సంస్థలు, సోషల్‌ మీడియా వేదికలు పైరసీ లింకులను వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్‌ చేశాక, అదే కంటెంట్‌ మరో పేరుతో ప్రత్యక్షమయ్యే ప్రమాదాన్ని గుర్తించి.. మిర్రర్‌, ప్రాక్సీ వెబ్‌సైట్లపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది.

నిర్మాణ సంస్థ లింకులు అందించిన వెంటనే వాటిని బ్లాక్‌ చేయడం లేదా తొలగింపు చర్యలు చేపట్టాలని సూచించింది. గూగుల్‌తో పాటు ఇతర డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల ప్రతినిధులు సైతం ఈ ఆదేశాలపై అభ్యంతరం లేదని తెలిపారు.

‘దంగల్‌’ ఫేమ్‌ నితేశ్‌ తివారీ దర్శకత్వంలో ఈ పౌరాణిక చిత్రాన్ని రెండు భాగాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం నిర్మాణానికే సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చవుతుండగా, రెండు భాగాల మొత్తం బడ్జెట్‌ దాదాపు రూ.4 వేల కోట్లు ఉంటుందని నిర్మాణ సంస్థ కోర్టుకు తెలిపింది.

అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదటి భాగం నవంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ముందే కోర్టు ఇచ్చిన ఈ రక్షణ ఉత్తర్వులు చిత్రబృందానికి, నిర్మాత నమిత్‌ మల్హోత్రా అండ్‌ టీమ్‌కు పెద్ద ఊరటనిచ్చాయి. ఈ కాపీరైట్‌ కేసు తదుపరి విచారణను డిసెంబర్‌ 16కు వాయిదా వేయగా.. అప్పటివరకు ఈ మధ్యంతర రక్షణ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.