రామకృష్ణాపూర్‌లో విషాదం

కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : రామకృష్ణాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. భగత్‌సింగ్‌ నగర్‌కు చెందిన పిన్నింటి మహేందర్‌ (39) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేందర్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిదండ్రులతో గొడవపడి మహేందర్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి 10.45 గంటల సమయంలో మహేందర్‌ తండ్రి బుచ్చిరాజయ్య రాత్రి విధులకు వెళ్లేందుకు కుమారుడిని పిలిచారు. అయితే ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి వెనుక ద్వారం గుండా బయటకు వచ్చి చూశారు.

ఇంటి ముందున్న షెడ్డులో మహేందర్‌ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామకృష్ణాపూర్‌ పోలీసులు తెలిపారు.