సింగరేణి ఫుట్‌బాల్ పోటీల్లో రామగుండం జట్టు విజయం!
విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, పతకాలు అందజేసిన జీఎం లలిత్ కుమార్
గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కంపెనీ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో రామగుండం జట్టు విజేతగా నిలిచింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజులపాటు జరిగిన ఈ పోటీలు బుధవారం ముగిశాయి.
సింగరేణిలోని 11 ఏరియాల జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో ఆర్జీ-1, ఆర్జీ-2 సంయుక్త జట్టు ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా.. మందమర్రి, బెల్లంపల్లి సంయుక్త జట్టు రన్నరప్‌గా నిలిచింది. ముగింపు కార్యక్రమానికి రామగుండం ఏరియా-1 జనరల్ మేనేజర్ డి. లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలు, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక స్థైర్యం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగులకు ప్రతినిధులుగా నిలిచి క్రీడాకారులు ప్రతిభ చాటారని కొనియాడారు. సంస్థలో విధుల పట్ల చూపే నిబద్ధతనే క్రీడల్లోనూ ప్రదర్శించాలని, ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారు జాతీయ స్థాయిలో జరిగే కోల్ ఇండియా పోటీల్లో పాల్గొని సింగరేణి కీర్తిని చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల జీఎంలు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ రిఫరీలు పాల్గొన్నారు.
