RAIN ALERT | ఐదు రోజుల పాటు వర్షాలు..
- గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ఆంధ్రప్రభ : తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 24 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, సనత్‌నగర్, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, మధురానగర్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, మెహదీపట్నం ప్రాంతాల్లో వర్షం పడింది. ఎల్బీనగర్, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డి నగర్‌తో పాటు నగర శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. వర్షం కారణంగా ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో అమీర్‌పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది.
ఉరుములు.. మెరుపులతో వర్షాలు
ఆగస్టు 18 మధ్యాహ్నం నుంచి ఆగస్టు 20 ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు 20 ఉదయం 8.30 గంటల నుంచి ఆగస్టు 23 ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
ప్రయాణికులు.. రైతులు అప్రమత్తం
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు, వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు.
