నేటి నుంచి కుర‌వ‌నున్న వర్షాలు

  • పలు జిల్లాలకు వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
  • దక్షిణ, తూర్పు తెలంగాణపై వర్ష ప్రభావం
  • నల్గొండ, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు అలర్ట్‌
  • హైదరాబాద్‌లో నేడు అక్కడక్కడ వర్షాలు.. రేపు మరింత విస్తృతంగా కురిసే అవకాశం
  • మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అప్రమత్తంగా ఉండాలని సూచన

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణలో అక్టోబర్‌ 17 నుంచి వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉంది. నల్గొండ, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. సూర్యాపేట జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ జిల్లాల్లోనూ వర్ష సూచన
సిద్దిపేట, మెదక్‌, హనుమకొండ, వరంగల్‌, జనగామ, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, నిర్మల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఆయా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండొచ్చని అంచనా.

హైదరాబాద్‌లోనూ వర్షాలు
హైదరాబాద్‌లో ఈ రోజు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నగరంలో వర్షాలు కురిసేందుకు మరింత అనుకూల పరిస్థితులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లాలవారీగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున తాజా అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనించాలి.