Rain |జలమయమైన ఎయిర్‌పోర్ట్‌.. ఐఎండీ భారీ హెచ్చరిక

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ వెబ్‌: దేశ రాజధాని ఢిల్లీని శుక్రవారం మధ్యాహ్నం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు ముంచెత్తాయి. గంటల తరబడి కురిసిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ పరిస్థితులు తీవ్రరూపం దాల్చడంతో భారత వాతావరణ శాఖ ఢిల్లీకి జారీ చేసిన హెచ్చరికను మరింత తీవ్రం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ వర్ష ప్రభావం కనిపించింది.

భారీ వర్షాల ప్రభావం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా పడింది. విమానాశ్రయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. మోకాళ్ల లోతు వరకు నీరు చేరడంతో ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికులు సామాన్ల బండ్లను నీటిలోనే తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. విమాన రాకపోకలకు ప్రతికూల వాతావరణం అంతరాయం కలిగించింది.

విమానాల దారి మళ్లింపు

మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 గంటల మధ్య మొత్తం తొమ్మిది విమానాలను ఇతర ప్రాంతాలకు దారి మళ్లించారు. వీటిలో జైపూర్‌కు నాలుగు, లక్నోకు నాలుగు, అహ్మదాబాద్‌కు ఒక విమానం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి, ఢిల్లీకి వెళ్లే విమానాల రాకపోకలపై ప్రతికూల వాతావరణ ప్రభావం ఉండే అవకాశం ఉందని విమానయాన సంస్థలు ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. ప్రయాణికులు తమ విమానాల సమయాలను ముందుగానే పరిశీలించుకోవాలని సూచించాయి.

ఢిల్లీతో పాటు నోయిడా, ఘాజియాబాద్‌ ప్రాంతాలకు కూడా వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో వాతావరణ శాఖ జారీ చేసిన తాజా సూచనల్లో ఈ ప్రాంతాలను అప్రమత్తం చేసింది. మరోవైపు హర్యానాలోని గురుగ్రామ్‌కు ఆ సమయంలో ఎలాంటి హెచ్చరిక జారీ కాలేదు. భారీ వర్షంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని రహదారులు కూడా నీట మునిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.