రైల్వే ఉద్యోగుల సంక్షేమం, భద్రతపై చర్యలు చేపట్టాలి

అదనపు డివిజనల్‌ మేనేజర్‌ ఏ. సంజీవరావుకు ఎంప్లాయీస్‌ సంఘం వినతి

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే అదనపు డివిజనల్‌ మేనేజర్‌ ఏ. సంజీవరావును ఎంప్లాయీస్‌ సంఘం నాయకులు కోరారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు పలు రైల్వే విభాగాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘం బెల్లంపల్లి శాఖ కార్యదర్శి శివ, ఉపాధ్యక్షుడు కాంచన కుమార్‌ అదనపు డివిజనల్‌ మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రైల్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

బెల్లంపల్లి రైల్వే కాలనీలోని క్రికెట్‌ మైదానాన్ని పునరుద్ధరించాలని, ఆర్‌ఓహెచ్‌ డిపో షెడ్లలో నీటి చల్లదనం పరికరాలను ఏర్పాటు చేయాలని కోరారు. రైల్వే కాలనీలోని క్వార్టర్లకు మరమ్మతులు చేపట్టాలని, ఉద్యోగులకు మెరుగైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

సీ అండ్‌ డబ్ల్యూ విభాగంలో కొత్తగా షెడ్‌ విస్తరణ పనులు చేపట్టడంతో పాటు అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు. రైల్వే యార్డుల్లోని పాయింట్ల వద్ద సిబ్బంది రక్షణ కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు సంబంధించిన సమస్యలపై అదనపు డివిజనల్‌ మేనేజర్‌ సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లోని వివిధ విభాగాల్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సంజీవరావు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సీనియర్‌ నాయకులు తిరుపాల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.