Rahul Gandhi |రేపే సుప్రీంకు పాదయాత్రగా రాహుల్!
- ఓటు చోరీ, ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్ పోరాటం..
- ఓటు చోరీని అరికట్టాలి.. ఎస్ఐఆర్‌ను నిలిపివేయాలి
- జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్
- ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఐక్యతకు పిలుపు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఓటు చోరీని అరికట్టాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రేపు సుప్రీంకోర్టుకు పాదయాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.
నిన్న ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన యువతపై పోలీసులు, బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. యువత ద్వేషంతో కాకుండా ప్రేమతో నిరసన తెలిపేందుకు వచ్చారని పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని వ్యాఖ్యానించారు.
రేపు నిర్వహించనున్న పాదయాత్రలో రాజకీయ పార్టీలు, లింగ, కుల, వర్గ, రాష్ట్ర భేదాలకు అతీతంగా ప్రజలంతా పాల్గొనాలని రాహుల్ పిలుపునిచ్చారు. యువత, ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజ సంఘాలు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగి రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నవారంతా తమతో కలిసి నడవాలని కోరారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దేశ ప్రజల గొంతును అణచివేయలేరని రాహుల్ వ్యాఖ్యానించారు.
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రేమ, సోదరభావం, దేశభక్తితో ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టుకు పాదయాత్ర నిర్వహించి తమ డిమాండ్లను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
