తెప్ప బోల్తా.. మత్స్యకారుడి మృతి
సముద్రంలో అల్లకల్లోలంతో ఎర్రముక్కాం తీరంలో విషాదం
సోంపేట, ఆంధ్రప్రభ : సముద్రం గత కొద్ది రోజులుగా అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ పొట్టకూటి కోసం వేటకు వెళ్లిన మత్స్యకారులపై ప్రమాదం విరుచుకుపడింది. సోంపేట మండలం ఎర్రముక్కాం తీరంలో మంగళవారం తెప్ప బోల్తాపడటంతో ఓ మత్స్యకారుడు మృతి చెందగా, మరో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మృతుడిని మందస మండలం గెడ్డవూరు గ్రామానికి చెందిన వంక యాదవరావు (52)గా గుర్తించారు. తోటి మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం.. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో గత కొద్ది రోజులుగా వేటకు వెళ్లలేదు.
మంగళవారం సముద్ర పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని భావించి యాదవరావుతో పాటు అదే గ్రామానికి చెందిన సొంత అన్నదమ్ములు వంక ధర్మారావు, వంక భీమారావు, కోడ కూర్మారావు కలిసి తెప్పపై వేటకు వెళ్లారు. తీరానికి కొంత దూరంలో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడిన అలల తాకిడికి తెప్ప బోల్తాపడింది. ఈ ప్రమాదంలో యాదవరావు తెప్ప కింద చిక్కుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురు తోటి మత్స్యకారుల సహాయంతో ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. అనంతరం యాదవరావు మృతదేహాన్ని హరిపురం ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
హెచ్చరికలు ఇవ్వలేదని ఆవేదన
సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ మత్స్యశాఖ అధికారులు ఎలాంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయలేదని తోటి మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం, చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేని పరిస్థితుల్లోనే ప్రాణాలను పణంగా పెట్టి వేటకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరారు.
