AP ZPTC, MPTC, Elections: పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు..

ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు..
ఓటుహక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు

కర్నూలు రూరల్ బ్యూరో, నవంబర్ 05, ఆంధ్రప్రభ: కర్నూలు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ప్రజాస్వామ్య పండుగలో భాగంగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం నుంచే గ్రామీణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.

జిల్లాలో ఉదయం 9 గంటల సమయానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 8.25 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రారంభమైన తొలి గంటల్లోనే ఓటర్లు కేంద్రాలకు చేరుకోవడంతో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు.