హైదరాబాద్, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా నకిరేకల్ లో పదో తరగతి పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారం ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు కు చేరింది. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా పేపర్ లీకేజీకి సహకరించిందంటూ విద్యార్థిని ఝాన్సీలక్ష్మి ని అధికారులు డీబార్ చేశారు. అయితే, మొత్తం వ్యవహారంలో తన తప్పేమీ లేదని, పరీక్షకు అనుమతించాలని ఝాన్సీలక్ష్మి అధికారులను వేడుకుంది. ఎవరో ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న తనను బెదిరించి ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసుకుని వెళ్లారని వాపోయింది.
ఫోటోలు తీసిన వ్యక్తులు ఎవరో కూడా తనకు తెలియదని బాధితురాలు మీడియా ముందు కన్నీళ్లు పెట్టింది. ఈ క్రమంలోనే విద్యార్థిని ఝాన్సీలక్ష్మి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ను ఆశ్రయించింది. తనపై డీబార్‌ను ఎత్తివేసి.. వెంటనే పరీక్ష రాసేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖాలు చేసింది. అదేవిధంగా విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, నల్గొండ డీఈవో, ఎంఈవో , నకిరేకల్ ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్‌లను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చింది. ఈ మేరకు ఝాన్సీలక్ష్మి పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.