TG | పుష్కర పనుల్లో నాణ్యత పాటించాలి.. మంత్రి శ్రీధర్ బాబు

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి/ మహాదేవ పూర్ (ఆంధ్రప్రభ) : సరస్వతి పుష్కర పనుల్లో నాణ్యత పాటించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం కాళేశ్వరంలో విఐపి ఘాట్, సరస్వతి మాతా విగ్రహం, జ్ఞానతీర్థం, నదిలో భక్తుల స్నానమాచరించు ప్రదేశం, టెంట్ సిటీ, తదితర అంశాలను పరిశీలించారు. అనతరం టెంట్ సిటీలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి రాక సందర్భంగా బందోబస్తు, పనులు పూర్తి చేయు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పనులు చాలా స్లోగా జరుగుతున్నాయని, మీరే జవాబు చెప్పాలన్నారు. పట్టణం మొత్తాన్ని విద్యుద్దీకరణతో ముస్తాబు చేయాలని 12రోజులు పండుగ వాతావరణం చేయాలని సూచించారు. సరస్వతి మాత విగ్రహాన్ని పూలతో అందంగా అలంకరణ చేయాలని తెలిపారు. పిండ ప్రధాన భవనం అసంపూర్తిగా ఉందని దేవాదాయ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు నదిలోకి స్నానాలకు వెళ్ళడానికి తాత్కాలిక రహదారి ఏర్పాటుతో పాటు క్వియర్ మాట్ ఏర్పాటు చేయాలని తెలిపారు.

భక్తులు నదిలోకి వెళ్లకుండా బారికేడ్స్, ప్రమాద హెచ్చరికల బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. నదిలో 50మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు నాటుపడవలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. పుష్కరాల సందర్భంగా మొట్టమొదటి సారిగా కాలేశ్వరంలో టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమాలు సజావుగా, సక్రమంగా పకడ్బందీగా జరిగేందుకు మినిట్ టు మినిట్ కార్యక్రమం తయారు చేయాలని సూచించారు. హారతి కార్యక్రమం పర్యవేక్షణకు దేవాదాయ‌శాఖ నుండి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవానికి వస్తున్నారని, అలాగే తదుపరి రోజుల్లో గవర్నర్, రాష్ట్ర మంత్రులు వచ్చే ఆవకాశం ఉన్నందున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, దేవాదాయ శాఖ ఆర్జెసి రామకృష్ణారావు, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్, వైద్య, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *