పేదల ఆకలి తీర్చడమే లక్ష్యం
రూ.5కే నాణ్యమైన అల్పాహారం..
అన్నా క్యాంటీన్‌లో ఎమ్మెల్యే గద్దె ఆకస్మిక తనిఖీ
కృష్ణలంక, ఆంధ్రప్రభ: పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. సోమవారం కృష్ణలంక 20వ డివిజన్‌లోని నిర్మల్ శిశుభవన్ సమీపంలోని అన్నా క్యాంటీన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అల్పాహారం చేస్తున్న వారితో మాట్లాడి ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. నిర్వహణ సిబ్బందితోనూ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అన్నా క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం రూ.5 చొప్పున అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తక్కువ ధరకే ఆహారం లభించడంతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. పొదుపు చేసిన మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను నిలిపివేయడం వల్ల పేదలు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా వాటిని పునఃప్రారంభించామని తెలిపారు.
అన్నా క్యాంటీన్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని గద్దె రామమోహన్ చెప్పారు. కృష్ణలంక క్యాంటీన్‌లో ఆహార నాణ్యత బాగుందని అక్కడ భోజనం చేస్తున్న వారు తనకు తెలిపారని అన్నారు. నిర్వహణలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో గొరిపర్తి నామేశ్వరరావు, కొవ్వూరి కిరణ్, కేసనం శివభావనారాయణ, నిమ్మల జ్యోతిక, తాడువాయి సత్యనారాయణ, షేక్ అబ్దుల్లా, రవి జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.
