Pulivendula Counting | కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు
అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపిన పులివెందుల కౌంటింగ్ వ్యవహారంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పులివెందుల మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో అక్కడ కౌంటింగ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తికాగా, పులివెందుల ఫలితాల వెల్లడిపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.
70 బూత్‌లలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు..
పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మొత్తం 80 పోలింగ్ కేంద్రాల పరిధిలో 70 చోట్ల అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారని, కొన్ని కేంద్రాల్లో వారిని బయటకు పంపించారని ఆరోపిస్తూ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం అధికారుల నివేదికల ఆధారంగా పులివెందులలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించింది. 1, 3, 7, 8 వార్డులకు సంబంధించిన నాలుగు కేంద్రాల్లో నవంబర్ 2న తిరిగి పోలింగ్ నిర్వహించారు.
కౌంటింగ్ నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయం
ఎన్నికల సంఘం నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, స్థానిక అభ్యర్థి వైఎస్ ప్రమీల హైకోర్టును ఆశ్రయించారు. తాము కోరిన అన్ని కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించకుండా కేవలం నాలుగు కేంద్రాలకే పరిమితం చేయడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ప్రధాన పిటిషన్ విచారణలో ఉండగానే ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడంతో, కౌంటింగ్‌ను నిలిపివేయాలని కోరుతూ మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నవంబర్ 2న హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
నేడు ఫలితాలపై ఉత్కంఠ
తాజాగా పిటిషన్ డిస్మిస్ కావడంతో పులివెందులలో ఓట్ల లెక్కింపునకు అడ్డంకులు తొలగినట్లయింది. దీంతో ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడి ఫలితాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పులివెందులలోనూ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగేందుకు మార్గం సుగమం కావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
