పులాజీ బాబా ఆధ్యాత్మిక సేవలు ఆదర్శనీయం
దివ్య సమాధి మందిర నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎంపీ గోడం నగేష్
జైనూర్, ఆంధ్రప్రభ : శ్రీశ్రీశ్రీ సద్గురు పరమహంస పులాజీ బాబా ఆధ్యాత్మిక ధ్యాన, ప్రవచన సేవల ద్వారా ఎన్నో కుటుంబాల్లో ఆధ్యాత్మిక మార్పులు వచ్చాయని, వారు సన్మార్గంలో నడుస్తున్నారని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్ సిద్ధేశ్వర సంస్థాన్‌లో గురువారం శ్రీశ్రీశ్రీ సద్గురు పులాజీ బాబా దివ్య సమాధి మందిర నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. బాబా సతీమణి ఇంగ్లే దుర్పత బాయి, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, వక్తలు, భక్తులతో కలిసి ఎంపీ గోడం నగేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థాన్ అధ్యక్షుడు ఇంగ్లే కేశవ్ దాదా, కమిటీ సభ్యులు ఎంపీ నగేష్‌ను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక మార్పులు తీసుకురావడానికి పులాజీ బాబా చేసిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజల్లోనూ బాబా తన ఆధ్యాత్మిక సేవల ద్వారా చైతన్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు.
బాబా దివ్య సమాధి మందిర నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన సేవలు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. పట్నాపూర్ సిద్ధేశ్వర సంస్థాన్ తెలంగాణలో మరో షిరిడీ సాయిబాబా మందిరంగా ప్రసిద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు కూడా పులాజీ బాబా అందించిన ఆధ్యాత్మిక, ధ్యాన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, మహారాష్ట్ర రిటైర్డ్ గిరిజన సంక్షేమ కమిషనర్ అంబాజీ సర్ కొండే, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే ఉత్తమరావు, డీఎస్పీ రఘునాథ్, సిద్ధేశ్వర సంస్థాన్ కమిటీ ప్రతినిధులు వామన్‌రావు ఇంగ్లే, దాదారావు డుక్రే, సుభాష్, సభ్యులు కనక తుకారాం, పెందూర్ తులసీరామ్, కేశవ్, సర్పంచులు కందారే లక్ష్మి, బాలాజీ, కుమ్ర యశోద, కేశవ్, కుమ్ర దేవుశావ్, నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.
