గాంధీ హత్యపై మోదీ, మోహన్ భగవత్ క్షమాపణలు చెప్పాలి
ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించిన అంశంపై ప్రజలకు సమాధానం ఇవ్వాలి..
కాంగ్రెస్ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్
నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: మహాత్మా గాంధీ హత్యపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, ఈ అంశంపై సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ డిమాండ్ చేశారు. గాంధీ హత్యకు నాథూరామ్ గాడ్సే పాల్పడ్డారని, ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌పై అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిషేధం విధించారని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సుఖజీవన్‌రెడ్డి గార్డెన్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సచిన్ సావంత్ హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సచిన్ సావంత్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ హత్యకు నాథూరామ్ గాడ్సే, ఆయన సోదరుడు గోపాల్ గాడ్సే తదితరులు పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటన అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌పై అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిషేధం విధించారని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను తమ పార్టీ నాయకుడిగా చెప్పుకోవడం బీజేపీకి సరికాదని, ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడని సచిన్ సావంత్ అన్నారు.
ఈ అంశాలకు సంబంధించిన వాస్తవాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తావిస్తే ఆయనపై పరువు నష్టం దావా వేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. బీజేపీ అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని సచిన్ సావంత్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై దేశ ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశానికి దిశానిర్దేశం చేసేది కాంగ్రెస్ పార్టీ అని, లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీ సమావేశాలను ప్రతి నెల నిర్వహించి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని జిల్లా పరిస్థితులపై కార్యాచరణ రూపొందించి పీసీసీకి పంపించాల్సి ఉంటుందని వివరించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, గద్వాల జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, కేతూరి వెంకటేష్, మల్లయ్య, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
