ఓజోన్‌ పొర పరిరక్షణ అందరి బాధ్యత

ఆంధ్రప్రభ, నర్సాపురం: ఓజోన్‌ పొర పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు నర్సాపురంలోని వై.ఎన్‌. కళాశాల సామాజిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు ఓజోన్‌ పొరను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ నినదించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.వి.ఆర్‌.బి. వరలక్ష్మి మాట్లాడుతూ.. సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత వికిరణాల నుంచి భూమిపై జీవరాశులను రక్షించే సహజ రక్షణ కవచమే ఓజోన్‌ పొర అని తెలిపారు.ఓజోన్‌ పొర క్షీణతను అరికట్టేందుకు కాలుష్య కారక రసాయనాల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ముఖ్యంగా క్లోరో ఫ్లోరో కార్బన్స్‌ (సీఎఫ్‌సీ) విడుదలను నియంత్రించడం ద్వారా ఓజోన్‌ పొరను పరిరక్షించవచ్చని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ చెట్లను పెంచడం, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడుకోవడం ద్వారా భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ఓజోన్‌ పొర రక్షణపై ప్రతిజ్ఞ చేశారు.