ఏపీ ప్రభుత్వానికి నిర్మాతల మండలి థ్యాంక్స్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఏళ్లుగా నిలిచిపోయిన నంది ఫిల్మ్‌ అవార్డులను పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ హర్షం వ్యక్తం చేసింది. 2017 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న నంది ఫిల్మ్‌ అవార్డులను తిరిగి పునరుద్ధరించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌, ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌, టీవీ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి.భరత్‌ భూషణ్‌, ఎండీ కె.ఎస్‌.విశ్వనాథన్‌లకు కౌన్సిల్‌ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది.

ఏపీ ఎఫ్‌డీసీ సెప్టెంబర్‌ 24న ప్రభుత్వానికి సమర్పించిన లేఖలోని అభ్యర్థనలను పరిశీలించి.. బంగారు నంది, వెండి నంది, కంస్య నంది అనే మూడు విభాగాల్లో నంది అవార్డులను పునరుద్ధరించేందుకు అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే 2017-2024 సంవత్సరాలకు సంబంధించిన ‘ఎన్‌టీఆర్‌ జాతీయ ఫిల్మ్‌ అవార్డు’ పునరుద్ధరణను పరిశీలించినందుకు కూడా కృతజ్ఞతలు తెలిపింది. 1964 నుంచి కొనసాగుతున్న నంది అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు ప్రజల సంస్కృతితో భావోద్వేగంగా ముడిపడి ఉన్నాయని కౌన్సిల్‌ పేర్కొంది.

నంది అవార్డుల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులను గౌరవించడం ప్రత్యేకమైన విషయమని నిర్మాతల మండలి తెలిపింది. నంది అవార్డుల పునరుద్ధరణపై తాము ఎంతో సంతోషంగా ఉన్నామని కౌన్సిల్‌ కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌ పేర్కొన్నారు. నంది అవార్డు అందుకోవడం తెలుగు సినీ రంగానికి ఎప్పుడూ ప్రత్యేకమైన గౌరవమని అన్నారు. ఇదిలా ఉండగా.. 2017-2024 కాలానికి నంది అవార్డుల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది.

మరోవైపు రఘుపతి వెంకయ్య, బి.ఎన్‌.రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి వంటి ఇతర జాతీయ చలనచిత్ర పురస్కారాలపైనా పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ అవార్డుల విషయంలో ప్రభుత్వం నుంచి తాజా నిర్ణయం వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం నంది ఫిల్మ్‌, టీవీ అవార్డులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో నంది ఫిల్మ్‌ అవార్డుల దరఖాస్తులకు అక్టోబర్‌ 12 చివరి తేదీగా పేర్కొంది.