- జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమం, గౌరవాన్ని కాపాడే దిశగా అక్రిడిటేషన్ పాలసీపై ప్రభుత్వం వేగంగా దృష్టి సారించిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ మేరకు ఈరోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతాధికారులతో కలిసి అక్రిడిటేషన్ పాలసీ విధివిధానాలపై కీలక చర్చలు జరిపారు.
ఈ సమీక్షా సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, సీఎం సిపిఆర్‌వో మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందేలా విధి విధానాలను రూపొందిస్తున్నాం అని తెలిపారు. జర్నలిస్టుల గౌరవాన్ని కాపాడే విధంగా అక్రిడిటేషన్ పాలసీ ఉండాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.
వీలైనంత త్వరగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. అందుకోసం ఈ నెల చివరి నాటికి అక్రిడిటేషన్ పాలసీకి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.