మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి: హరీశ్‌రావు
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, మృతి చెందిన టీచర్ల కుటుంబాల సమస్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన
డెత్ గ్రాట్యుటీ, కుటుంబ పింఛన్, కారుణ్య నియామకాలు, పెండింగ్ డీఏలు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. టీచర్ల సంఘం నాయకులు, మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు తనను కలిసి తమ సమస్యలను వివరించారని ఆయన తెలిపారు.
గత 32 నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని బాధిత కుటుంబాలు వాపోయినట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
40 కుటుంబాలు ఇబ్బందుల్లో..
2004 తర్వాత సీపీఎస్ విధానంలో నియమితులై మరణించిన సుమారు 40 మంది మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ జీవోలు 60, 58 ప్రకారం డెత్ గ్రాట్యుటీ, కుటుంబ పింఛన్ పొందేందుకు అర్హత ఉన్నప్పటికీ, వాటి అమలులో సమస్యలు ఉన్నాయని ఆరోపించారు.
మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలకు మానవతా దృక్పథంతో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. డెత్ గ్రాట్యుటీ, కుటుంబ పింఛన్ సౌకర్యాలను రాష్ట్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులందరికీ పూర్తిస్థాయిలో వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్న హరీశ్‌రావు
రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది ఉపాధ్యాయులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ బకాయిల చెల్లింపు కోసం విద్యాశాఖ కోరిన రూ.93 కోట్ల అదనపు బడ్జెట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపలేదని ఆయన పేర్కొన్నారు.
పెండింగ్ డీఏల కారణంగా ఒక్కో ప్రిన్సిపాల్‌కు రూ.3.52 లక్షలు, పీజీటీకి రూ.2.81 లక్షలు, టీజీటీకి రూ.2.36 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. ఈ మొత్తాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ఉద్యోగ, ఆర్థిక భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కూడా కల్పించాలని హరీశ్‌రావు కోరారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని వెంటనే వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అలాగే మోడల్ స్కూళ్లను ‘010’ పద్దు కిందకు తీసుకువచ్చి ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.
“టీచర్లు పాఠాలు చెప్పాల్సింది పోయి తమ హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రావడం బాధాకరం” అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు పెండింగ్ డీఏలు, డెత్ గ్రాట్యుటీ, కుటుంబ పింఛన్ సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. అవసరమైతే అసెంబ్లీలోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టం చేశారు.
