22-ఏ భూములపై సభలో తప్పుడు ఆరోపణలు చేశారంటూ నోటీసులు

సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారంటూ చర్యలు కోరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
తమ భూములకు సంబంధించిన అనుమతులు, ఎన్‌ఓసీలు ఉన్నాయంటూ రికార్డుల ప్రస్తావన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ అసెంబ్లీలో 22-ఏ నిషేధిత భూములపై జరిగిన చర్చ రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ అంశంపై సభలో తమపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు పిటిషన్లు సమర్పించారు.

సెప్టెంబరు 12న శాసనసభలో 22-ఏ భూములపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి పొంగులేటి.. హరీశ్‌రావు కుటుంబానికి సంబంధించిన భూములు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి భూములపై ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి వ్యవస్థ ద్వారా నిషేధిత భూముల విషయంలో అక్రమాలు జరిగాయని మంత్రి సభలో పేర్కొన్నారు. హరీశ్‌రావు మామకు సంబంధించిన భూమిపై కూడా ఆయన ఆరోపణలు చేశారు.

‘సభలో ఆధారాలు లేకుండా ఆరోపణలు’..

మంత్రి చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు సభలో లేని సమయంలో మంత్రి తమపై ఆరోపణలు చేశారని హరీశ్‌రావు విమర్శించారు. 22-ఏ అంశంపై మంత్రి వ్యాఖ్యలను హరీశ్‌రావు గతంలోనే బహిరంగంగా ఖండించారు.

తమ భూములకు సంబంధించిన అనుమతులు, ఎన్‌ఓసీలు గతంలోనే జారీ అయ్యాయని, వాటికి సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉన్నాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. సభా రికార్డుల్లో చేసిన వ్యాఖ్యలపై స్పీకర్‌ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

పల్లా సవాల్‌..

తనకు సంబంధించిన భూములపై మంత్రి చేసిన ఆరోపణలను నిరూపించాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి సవాల్‌ చేసినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. ఆరోపణలు నిరూపితమైతే ఎమ్మెల్యే పదవితో పాటు రాజకీయాలకు రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించినట్లు పేర్కొన్నారు.

పొంగులేటి వాదన మరోలా..

మరోవైపు 22-ఏ భూముల అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సభలో విస్తృతంగా వివరణ ఇచ్చారు. 22-ఏ జాబితా సమస్య కొత్తగా ఏర్పడింది కాదని, ఇది గతంలో నుంచీ కొనసాగుతున్న సమస్య అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 1,02,52,690 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండగా, 2026 ఆగస్టు 30 నాటికి ఆ విస్తీర్ణం 1,02,05,250 ఎకరాలకు తగ్గిందని సభలో గణాంకాలు వెల్లడించారు.

గత ప్రభుత్వ హయాంలో ధరణి ద్వారా భూముల రికార్డుల్లో మార్పులు జరిగాయని మంత్రి ఆరోపించగా.. బీఆర్‌ఎస్‌ నేతలు ఆ వాదనలను ఖండిస్తున్నారు. దీంతో 22-ఏ భూముల వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మరో రాజకీయ వివాదానికి దారితీసింది.

స్పీకర్‌ నిర్ణయంపైనే ఆసక్తి

తమపై సభలో చేసిన వ్యాఖ్యలను సభా హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరిన నేపథ్యంలో.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఈ నోటీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

22-ఏ భూములపై ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య.. ఇప్పుడు సభా హక్కుల నోటీసులు రాజకీయ వేడిని మరింత పెంచాయి.