అనంతగిరి ఘాట్‌లో ఘోర బస్సు ప్రమాదం

  • బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పిన ప్రైవేట్ బస్సు
  • నలుగురు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

పటాన్‌చెరు, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టల్లో శనివారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరు మండలం క్యాసారం గ్రామానికి చెందిన వారు ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతులను ప్రమీల (52), యాదమ్మ (52), మాల పద్మ (50), పద్మమ్మ (55)గా గుర్తించారు.

ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్యాసారం గ్రామానికి చెందిన వెల్డర్ నారాయణరెడ్డి (55) శుక్రవారం ఇస్నాపూర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు గ్రామస్తులు ప్రైవేట్ బస్సులో వెళ్తుండగా అనంతగిరి గుట్టల వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.