షార్ట్‌సర్క్యూట్‌తో బస్సు దగ్ధం.. 33 మంది ప్రయాణికులు సురక్షితం
పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో ఘటన..
అప్రమత్తం చేసిన డ్రైవర్లు
పామిడి, ఆంధ్రప్రభ: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో 44వ జాతీయ రహదారిపై బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేటు బస్సులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను వెంటనే బస్సు నుంచి కిందకు దించడంతో అందులో ఉన్న 33 మంది సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ఇటీవల బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే ప్రైవేటు బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మితిమీరిన వేగంతో పాటు బస్సుల్లో సరైన భద్రతా సౌకర్యాలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు బస్సుల పరిస్థితి, నిర్వహణపై రోడ్డు రవాణా శాఖ అధికారులు తగినంతగా దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొన్ని ప్రైవేటు బస్సుల నిర్వాహకులు నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బస్సులను నడుపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
